మహిళల వన్డే ప్రపంచకప్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రాణించారు. ఫలితంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మసాబటా క్లాస్, షబ్నిమ్ ఇస్మైల్ చెరో రెండు వికెట్లు తీయగా క్లో ట్రియస్, అయాబొంగా ఖాకా చెరో వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేనకు.. ఓపెనర్లు స్మృతి మంధాన (71; 84 బంతుల్లో 6పోర్లు, 1సిక్స్), షెఫాలీ వర్మ (53; 46 బంతుల్లో 8 పోర్లు) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించిన అనంతరం షెఫాలీ రనౌట్‌గా వెనుదిరిగింది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన యస్తికా బాటియా(2) విఫలమైనప్పటికి ఓపెనర్ మంధానతో కలిసి కెప్టెన్ మిథాలీ రాజ్ (68; 84 బంతుల్లో 8పోర్లు) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్థశతకాలను పూర్తి చేసుకున్నారు. అయితే.. స్వల్ప వ్యవధిలో ఇద్దరూ పెవిలియన్ చేరినప్పటికి ఆఖర్లో హర్మన్ ప్రీత్ కౌర్(48; 57 బంతుల్లో 4 పోర్లు) రాణించడంతో దక్షిణాఫ్రికా ముందు భారత్ మంచి లక్ష్యాన్ని ఉంచింది. ఈమ్యాచ్‌లో విజయం సాధిస్తేనే భారత జట్టు సెమీస్ చేరుతుంది.