ఉత్కంఠ పోరులో భారత్ విజయం..పోరాడి ఓడిన లంక
India register a thrilling 2-run win over Sri Lanka. ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ20లో శ్రీలంకపై భారత జట్టు 2 పరుగుల
By తోట వంశీ కుమార్ Published on 4 Jan 2023 8:37 AM ISTటీ20లోని మజా ఏమిటో మరోసారి తెలిసి వచ్చింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ20లో శ్రీలంకపై భారత జట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. హార్థిక్ సారథ్యంలోని యువ జట్టు గట్టిగానే పోరాడి మ్యాచ్‌ను గెలిచింది.
టాస్ ఓడడంతో ముందుగా భారత్ బ్యాటింగ్ చేసింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో 200 పై చిలుకు లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశిస్తుందని అభిమానులు బావించారు. అయితే.. అనూహ్యంగా భారత బ్యాటర్లు తడబడ్డారు. ఈ మ్యాచ్‌తో పొట్టి ఫార్మాట్‌లో అరంగ్రేటం చేసిన శుభ్‌మన్ గిల్(7)తో పాటు మిస్టర్ 360 డిగ్రీ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్(7), సంజు శాంసన్(5)లు విఫలం అయ్యారు. దీంతో 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా కష్టాల్లో పడింది.
ఈ దశలో అప్పటికే క్రీజులో కుదురుకున్న ఇషాన్‌కిషన్(37) కు కెప్టెన్ హార్థిక్ పాండ్య(29) జత కలిసాడు. వీరద్దరు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. ప్రమాదకంగా మారుతున్న ఈ జోడిని హసరంగా విడగొట్టాడు. ఇషాన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. స్వల్ప వ్యవధిలోనే కెప్టెన్ పాండ్య కూడా వెనుదిరిగాడు. దీంతో భారత్ 94 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కనీసం 140 అయినా దాటుతుండా అనే సందేహాలు కలిగాయి.
అయితే.. దీపక్ హుడా(41నాటౌట్; 23 బంతుల్లో 1 ఫోర్, 4సిక్స్‌లు), అక్షర్ పటేల్(31 నాటౌట్; 20 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్) లు ఇద్దరు సమయోచితంగా విజృంభించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. చివరి ఐదు ఓవర్లలో భారత్ 61 పరుగులు రాబట్టింది.
భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంక కు లక్ష్య చేధన కష్టమైంది. ముఖ్యంగా అరంగేట్ర బౌలర్ శివమ్ మావి విజృంభణతో లంక జట్టు అల్లాడిపోయింది. 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. నిశాంక(1), ధనుంజయ(8), అసలంక(12), రాజపక్స(10)లతో కుశాల్ మెండీస్(28) పెవిలియన్‌కు చేరుకున్నారు. ఈ తరుణంలో హసరంగ (21), కెప్టెన్ శానక(45) భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఆఖరి ఓవర్‌లో శ్రీలంక విజయానికి 13 పరుగులు అవసరం కాగా అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. భారత్ బౌలర్లలో శివమ్ మావి నాలుగు వికెట్లు తీయగా, ఉమ్రాన్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఇరు జట్ల మధ్య రెండో టీ20 గురువారం పుణె వేదికగా జరగనుంది.