భారత్-పాకిస్థాన్ సిరీస్ అతి త్వరలోనే అంటున్నారు..!

India-Pakistan T20 series in the offing. ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య, ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఓ సిరీస్ ఉంటుందని

By Medi Samrat  Published on  25 March 2021 7:48 AM GMT
India-Pakistan T20 series in the offing

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయనే వార్తలు రావడం ఆలస్యం.. భారత్-పాక్ మధ్య క్రికెట్ సిరీస్ గురించి ఎక్కువగా చర్చిస్తూ వస్తుంటారు. ఎన్నో ఏళ్లుగా భారత్-పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. ఇటీవల పాక్.. భారత్ తో స్నేహం కోరుతున్నట్లుగా కథనాలు రావడంతో ఇప్పుడు సిరీస్ గురించి తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది.

పీసీబీ భారత్ తో సిరీస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంది. పీసీబీ మాజీ ఛైర్మన్ జాకా అష్రాఫ్ కూడా ఇటీవల సిరీస్ పై వ్యాఖ్యలు చేశారు. జిన్నా-గాంధీ పేరిట క్రికెట్ సిరీస్‌ను నిర్వహిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని చెబుతూ వస్తున్నారు. నా పదవీకాలంలో జిన్నా-గాంధీ పేరుతో సిరీస్​ను ప్రారంభించడానికి ఎంతగానో ప్రయత్నించానని జాకా అష్రాఫ్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐకి కూడా తెలిపానని.. ఉగ్రవాద అంశాల కారణంగా భారత్ ఈ విషయంలో వెనక్కి తగ్గిందని అన్నారు. జిన్నా-గాంధీ పేరుతో సిరీస్​ ప్రారంభిస్తే.. ఇరు దేశాల మధ్య క్రికెట్​ సంబంధాలు బలోపేతమవుతాయని.. ఇది మరో యాషెస్​ సిరీస్​లా మారుతుందని అష్రాఫ్​ చెప్పారు.

ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య, ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఓ సిరీస్ ఉంటుందని పాకిస్థాన్ మీడియా కూడా బలంగా చెబుతూ వస్తోంది. జూన్ తరువాత రెండు దేశాల మధ్య సిరీస్ ఉంటుందని, అందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ వర్గాల నుంచి పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు)కి సమాచారం అందిందని కథనాలు ప్రచురించింది. పీసీబీ అధికారి కూడా 2023లో జరిగే ఆసియా కప్ లో ఇండియా ఆడుతుందనే భావిస్తున్నట్టు పీసీబీ చైర్మన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2012-13లో చివరిసారిగా ఓ క్రికెట్ సిరీస్ కోసం ఇండియాలో పాకిస్థాన్ పర్యటించింది. అంతకుముందు 2008లో ఆసియా కప్ కోసం ఇండియా జట్టు పాకిస్థాన్ కు వెళ్లింది. ఈ రెండు దేశాలు చివరిసారిగా 2019 ప్రపంచకప్​లో తలపడ్డాయి.


Next Story