పసిడి ఆశలు ఆవిరి.. సెమీస్‌లో ఓడిన పురుషుల హాకీ జట్టు
India mens hockey team lost Belgium.టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల టీం పసిడి ఆశలు ఆవిరి అయ్యాయి.
By తోట వంశీ కుమార్ Published on 3 Aug 2021 9:17 AM ISTటోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ టీం పసిడి ఆశలు ఆవిరి అయ్యాయి. సెమీఫైనల్‌లో ప్రపంచ నెంబర్ 1 బెల్జియం చేతిలో 5-2 తేడాతో ఓటమి పాలైంది. మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని హాకీ జట్టు మొదట్లో రెండు గోల్స్‌తో మెరిపించినా.. ఆపై బెల్జియం డిఫెండింగ్ ముందు తలవంచక తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికి భారత్ కాంస్యం గెలిచే అవకాశం ఉంది. రెండవ సెమీస్‌లో ఓడిన జట్టుతో బ్రాంజ్ మెడల్ కోసం పోటి పడనుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. కాంస్య పతకం దక్కనుంది.
తొలి క్వార్టర్ లో భారత జట్టు పైచేయి సాధించింది. ఫస్ట్ హాఫ్‌లో మన్‌దీప్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్‌లు ఇండియాకు గోల్స్ చేశారు. అయితే బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్ హెండ్రిక్స్ ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. రెండవ క్వార్టర్ ముగిసే సమయానికి 2-2 స్కోర్‌తో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. మూడో క్వార్టర్ నుంచి ఆట ఉత్కంఠభరితంగా కొనసాగింది. పెనాల్టీలను సద్వినియోగం చేసుకోవడంలో భారత్ విఫలమైంది. ఒకానొక దశలో బెల్జియం అదిరిపోయే డిఫెన్స్ ప్రదర్శించింది.
నాలుగో క్వార్టర్‌లో మరో గోల్‌తో స్కోర్ 3-2 అయ్యింది. ఆపై కాసేపటికే పెనాల్టీ కార్నర్‌తో మరో గోల్ సాధించి 4-2తో ఆధిక్యం కనబరిచింది. ఇక మిగిలిన టైంలో డిఫెండింగ్ ప్రదర్శించిన బెల్జియం.. మరో గోల్ చేయడంతో స్కోర్ 5-2గా మారింది. బెల్జియంను అడ్డుకోవడంలో భారత డిఫెన్స్ తడబడింది. దీంతో బెల్జియం.. భారత్ ఓటమిని శాసించింది. ఇక కాంస్య పతకం కోసం ఆగస్టు 5వ తేదీన ఇండియా మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.