రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సెమీ ఫైనల్-1 ఈరోజు జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత లెజెండ్స్ జట్టు వెస్టిండీస్ లెజెండ్స్ తో తలపడనుంది. ఇండియా లెజెండ్స్ జట్టు 6 మ్యాచ్ లలో 5 మ్యాచ్ లు విజయాన్ని అందుకుంది. ఒకే ఒక్క మ్యాచ్ ఇంగ్లండ్ లెజెండ్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. బుధవారం సాయంత్రం 7 గంటలకు రాయ్ పూర్ లో భారత లెజెండ్స్ జట్టు విండీస్ లెజెండ్స్ తో తలపడనుంది.
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సెమీ ఫైనల్స్ లోకి ఇంగ్లండ్ ను చిత్తు చేసి విండీస్ లెజెండ్స్ చేరుకున్నారు. ఆఖరి లీగ్ మ్యాచ్ మంగళవారం నాడు జరగ్గా.. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీ ఫైనల్ లో భారత్ తో తలపడాల్సి ఉండగా విండీస్ అనూహ్య విజయాన్ని అందుకుని ఇంగ్లండ్ లెజెండ్స్ కు షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ లెజెండ్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ పీ మస్టర్డ్ (57; 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులు), కెవిన్ పీటర్సన్ (38; 24 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు), ఒవైసీ షా (30 బంతుల్లో 53, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ లెజెండ్స్‌కు ఓపెనర్ డ్వేన్ స్మిత్ శుభారంభం అందించాడు. 31 బంతుల్లో 58 పరుగులు చేయగా.. వన్‌డౌన్‌లో వచ్చిన నర్సింగ్ డియోనారైన్ 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆఖరి బంతికి విండీస్ లెజెండ్స్ విజయం అందుకుంది.