కొంపముంచిన నోబాల్.. ప్రపంచకప్ నుంచి టీమ్ఇండియా నిష్క్రమణ
India fails to reach semis after three-wicket loss to South Africa.ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ 2022లో భారత్ కథ
By తోట వంశీ కుమార్ Published on 27 March 2022 3:07 PM ISTఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ 2022లో భారత్ కథ ముగిసింది. సెమీస్ చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమి పాలైంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. ఓటమితో భారత్ ఇంటి ముఖం పట్టింది. టీమ్ఇండియా నిర్థేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని సఫారీలు ఆఖరికి బంతికి చేధించడం గమనార్హం. దక్షాణాఫ్రిక బాట్యర్లలో లారా వోవార్డ్(80; 79 బంతుల్లో 11 పోర్లు), మిగ్నాన్ డు ప్రీజ్ (52 నాటౌట్; 63 బంతుల్లో 2 పోర్లు), లారా గూడల్(49; 69 బంతుల్లో 4 పోర్లు), కెప్టెన్ సున్ లూస్(22; 27 బంతుల్లో 1పోర్) రాణించారు.
ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు
దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే ఆఖరి ఓవర్‌లో 7 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉత్కంఠ నెలకొంది. తొలి బంతికి సింగిల్ రాగా.. రెండో బంతికి చెట్టీ(7) రనౌట్ అయ్యింది. విజయ సమీకరణం నాలుగు బంతుల్లో 5 పరుగులుగా మారింది. మూడు, నాలుగో బంతులకు సింగిల్స్ వచ్చాయి. ఐదో బంతికి మిగ్నాన్ భారీ షాట్ ఆడి హర్మన్ ప్రీత్ కౌర్ చేతికి చిక్కినా అది నోబాల్ కావడంతో వికెట్ లభించలేదు. చివరి రెండు బంతులకు రెండు సింగిల్స్ తీయడంతో సౌతాఫ్రికా విజయం సాధించింది.
అంతకముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేనకు.. ఓపెనర్లు స్మృతి మంధాన (71; 84 బంతుల్లో 6పోర్లు, 1సిక్స్), షెఫాలీ వర్మ (53; 46 బంతుల్లో 8 పోర్లు) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించిన అనంతరం షెఫాలీ రనౌట్‌గా వెనుదిరిగింది. గత మ్యాచ్‌లో అదరగొట్టిన యస్తికా బాటియా(2) విఫలమైనప్పటికి ఓపెనర్ మంధానతో కలిసి కెప్టెన్ మిథాలీ రాజ్ (68; 84 బంతుల్లో 8పోర్లు) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్థశతకాలను పూర్తి చేసుకున్నారు. అయితే.. స్వల్ప వ్యవధిలో ఇద్దరూ పెవిలియన్ చేరినప్పటికి ఆఖర్లో హర్మన్ ప్రీత్ కౌర్(48; 57 బంతుల్లో 4 పోర్లు) రాణించడంతో దక్షిణాఫ్రికా ముందు భారత్ మంచి లక్ష్యాన్ని ఉంచింది.