భారత్ మళ్లీ 'విశ్వవిజేత': టీమ్ ఇండియాపై విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం సాధించి...
By - అంజి |
భారత్ మళ్లీ 'విశ్వవిజేత': టీమ్ ఇండియాపై విరాట్ కోహ్లీ ప్రశంసల జల్లు!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం సాధించి, వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయంపై టీమ్ ఇండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 255/5 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
సంజూ శామ్సన్ (46 బంతుల్లో 89 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు భారత బౌలర్ల ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా (4/15), అక్షర్ పటేల్ (3/27) అద్భుతమైన బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ను కట్టడి చేశారు. భారత్ 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
భారత్ విజయంపై ఎక్స్ (X) వేదికగా స్పందించిన విరాట్ కోహ్లీ.. "ఛాంపియన్స్! అహ్మదాబాద్‌లో టీమ్ ఇండియా అద్భుత విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ అంతటా మన జట్టు ఆడిన మెరుపు దాడి ముందు ప్రపంచంలో ఏ జట్టు కూడా సరితూగదు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పట్టువదలక పోరాడిన కుర్రాళ్ల ప్రదర్శన అద్భుతం. మరోసారి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచిన ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్ సభ్యులకు అభినందనలు. జై హింద్!" అంటూ రాసుకొచ్చారు.
ఫైనల్‌లో 4 వికెట్లతో చెలరేగిన జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. అతను ఈ టోర్నీలో మొత్తం 14 వికెట్లతో వరుణ్ చక్రవర్తితో కలిసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలతో, మొత్తం 321 పరుగులు (సగటు 80.25, స్ట్రైక్ రేట్ 199.37) సాధించిన సంజూ శామ్సన్ ప్రతిష్టాత్మక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును దక్కించుకున్నాడు.