ఉత్కంఠ పోరులో టీమ్ ఇండియా విజ‌యం

India defeat West Indies by three runs to take 1-0 lead in 3-match series.చివ‌రి బంతి వ‌ర‌కు నువ్వా నేనా అన్న‌ట్లుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2022 8:04 AM IST
ఉత్కంఠ పోరులో టీమ్ ఇండియా విజ‌యం

చివ‌రి బంతి వ‌ర‌కు నువ్వా నేనా అన్న‌ట్లుగా సాగిన తొలి వ‌న్డేలో విండీస్‌పై భార‌త్ 3 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. 309 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ప్ర‌త్య‌ర్థి ముందు ఉంచినా టీమ్ఇండియా స్వ‌ల్ప తేడాతో గెల‌వ‌డం గ‌మనార్హం. చేధ‌న‌లో వెస్టిండీస్‌ జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 305 పరుగులకు ప‌రిమిత‌మైంది. మ్యాచ్ ఆఖ‌ర్లో అకేల్ హోసేన్ (33), రొమారియో షెపర్డ్ (39) ధాటిగా ఆడి విండీస్‌ను దాదాపుగా గెలిపించినంత ప‌ని చేశారు.

టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ బ్యాటింగ్‌ను ఆరంభించింది. ఓపెన‌ర్లు ధావ‌న్‌ ( 97, 99 బంతుల్లో10ఫోర్లు, 3 సిక్స్‌లు), శుభ్‌మన్‌ గిల్‌ (64) లు తొలి వికెట్‌కు 119 ప‌రుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. శుభ్‌మ‌న్ పెవిలియ‌న్ చేరాక శ్రేయాస్(54)తో క‌లిసి ధావ‌న్ స్కోర్ బోర్డును ముందుకు న‌డిపించాడు. అయితే సెంచ‌రీకి మూడు ప‌రుగుల దూరంలో ధావ‌న్ ఔటైయ్యాడు. వీరిద్ద‌రు రెండో వికెట్‌కు 94 ప‌రుగులు జత చేశారు. దూకుడుగా ఆడే క్ర‌మంలో శ్రేయాస్‌, సూర్యకుమార్‌ (13), శాంసన్‌ (12)లు వెనుదిర‌గ‌డంతో భార‌త్ 252 /5 తో నిలిచింది. ఈ ద‌శలో విండీస్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బంతులు వేయ‌డంతో ప‌రుగుల రాక మంద‌గించింది. ఆఖ‌రిల్లో దీపక్‌ హుడా (27), అక్షర్‌ పటేల్‌ (21) లు బ్యాట్ ఝుళిపించ‌డంతో టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవ‌ర్లో 7 వికెట్లు కోల్పోయి 308 ప‌ర‌గులు చేసింది.

భారీ ల‌క్ష్యంలో బ‌రిలోకి దిగిన విండీస్‌ను సిరాజ్ ఆదిలోనూ దెబ్బ‌తీశాడు. ఐదో ఓవ‌ర్‌లో షై హోప్‌(7)ను ఔట్ చేశాడు. దీంతో విండీస్ 16 ప‌రుగుల‌కే తొలి వికెట్ కోల్పోయింది. అయితే మ‌రో ఓపెన‌ర్ కైల్ మేయ‌ర్స్‌(75), వ‌న్‌డౌన్ బ్యాట్స్‌మెన్ బ్రూక్స్‌(46) రెండో వికెట్‌కు 117 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పి విండీస్‌ను పోటీలోకి తెచ్చారు. ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ఈ జోడిని శార్దూల్ విడ‌దీశాడు. తొలుత బ్రూక్స్‌, ఆ త‌రువాత మేయ‌ర్స్‌ను వెన‌క్కి పంపాడు. ఈ ద‌శలో భార‌త బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బంతులు వేయ‌డంతో పాటు కీల‌క స‌మ‌యాల్లో వికెట్లు తీయ‌డంతో ఓద‌శ‌లో విండీస్ 196 /5 తో నిలిచింది. అయితే.. కింగ్‌, హోసీన్ ఆరో వికెట్‌కు 56 ప‌ర‌గుల కీల‌క భాగ‌స్వామ్యం నెల‌కొల్ప‌డంతో జ‌ట్టును పోటీలో ఉంచారు. వీరిని చాహ‌ల్ విడ‌దీశాడు. ఆ త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన షెప‌ర్డ్ చివ‌ర్లో ధాటిగా ఆడాడు. చివ‌రి ఓవ‌ర్‌లో విండీస్ విజయానికి 15 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. సిరాజ్ క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో విండీస్ 11 ప‌ర‌గులు మాత్ర‌మే చేసింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Next Story