వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో రెండోస్థానానికి భారత్

India climb to 2nd spot in World Test Championship. భారత్ ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో రెండోస్థానానికి దూసుకెళ్లింది.

By Medi Samrat  Published on  16 Feb 2021 10:12 AM GMT
India climb to 2nd spot in World Test Championship.

చెన్నైలోని చెపాక్ వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో టీమ్ఇండియా 317 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ పై భారీ విజ‌యాన్ని సాధించింది. ఈ విజ‌యంతో తొలి టెస్టులో ఎదురైన ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకోవ‌డంతో పాటు నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 స‌మం చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 482 ప‌రుగుల భారీ విజ‌య‌ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ 164 పరుగుల‌కే కుప్ప‌కూలింది.

ఈ విజయంతో భారత్ ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో రెండోస్థానానికి దూసుకెళ్లింది. చెన్నైలో ఇంగ్లండ్ పై గెలిచి 4 టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసిన టీమిండియా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఇంగ్లండ్ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగోస్థానానికి చేరింది. టెస్టు చాంపియన్ షిప్ జాబితాలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు ఇప్పటికే ఫైనల్ చేరుకుంది. మరో బెర్తు కోసం భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గట్టిపోటీ నెలకొంది.

భారత్ జట్టు ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరాలంటే సిరీస్ లో మిగిలిన రెండు టెస్టుల్లోనూ విజయం సాధించాల్సి ఉంటుంది లేదా 2-1తో భారత్ సిరీస్ గెలవాల్సి ఉంది. ఇంగ్లండ్ 3-1 తేడాతో గెలిస్తే ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడుతుంది. 2-2తో గానీ, 1-1తో గానీ సిరీస్ సమం అయినా, 2-1తో ఇంగ్లండ్ గెలిచినా... భారత్, ఇంగ్లండ్ జట్లలో ఏ ఒక్కటీ ఫైనల్ చేరే అవకాశాలు లేవు. ఫైనల్లో న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా ఆడుతుంది.


Next Story