పృథ్వీ, ఇషాన్ ధనాధన్.. ధావన్ కెప్టెన్ ఇన్నింగ్స్
India beat Sri Lanka by 7 wickets to take 1-0 lead.భారత కుర్రాళ్లు అదరగొట్టారు. లంకతో వన్డే సిరీసును భారత
By తోట వంశీ కుమార్ Published on 19 July 2021 9:20 AM ISTభారత కుర్రాళ్లు అదరగొట్టారు. లంకతో వన్డే సిరీసును భారత జట్టు ఘనంగా ఆరంభించింది. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి వన్డేలో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 262 పరుగులు చేసింది. అనంతరం భారత్ లక్ష్యాన్ని 36.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది.
టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టుకు ఓపెనర్లు అవిష్క ఫెర్నాండో (35 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), మినోద్ భానుక (44 బంతుల్లో 27; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించి శుభారంభం అందించారు. తొలుత చాహల్ వికెట్ తీయగా.. కుల్దీప్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి లంకను గట్టి దెబ్బ కొట్టాడు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో లంక బ్యాట్స్‌మెన్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో ఓ దశలో లంక 205/7 స్కోర్‌తో నిలిచింది. ఈ దశలో లంక 250 మార్క్‌ను దాటడం కష్టంగా అనిపించింది. అయితే.. కరుణరత్నే (35 బంతుల్లో 43 నాటౌట్; ఫోర్, 2 సిక్స్‌లు), చమీర(13) దూకుడుగా ఆడి చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు రాబట్టడంతో లంక గౌరవప్రదమైన స్కోరు అందుకుంది. భారత బౌలర్లలో దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
పృథ్వీ, ఇషాన్ ధనాధన్..
అందివచ్చిన అవకాశాన్ని కుర్రాళ్లు బాగా ఒడిసిపట్టుకున్నారు. యువ ఓపెనర్ పృథ్వీ షా (24 బంతుల్లో 43; 9 ఫోర్లు) మెరుపులకు ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉరుములు తోడవగా.. కెప్టెన్ శిఖర్ ధావన్ (95 బంతుల్లో 86 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలిచాడు. పాండే(26) విఫలం అయినా.. సూర్యకుమార్ యాదవ్(31 నాటౌట్ ; 20 బంతుల్లో 5పోర్లు) కలిసి ధావన్ జట్టుకు విజయాన్ని అందించాడు.