తొలి టెస్టు మనదే.. బంగ్లాపై భారత్ ఘన విజయం
India Beat Bangladesh By 188 Runs In First Test.తొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది.
By తోట వంశీ కుమార్ Published on 18 Dec 2022 11:04 AM ISTతొలి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. 513 పరుగుల లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 324 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమ్ఇండియా 188 పరుగుల తేడాతో గెలిచింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ మూడు, సిరాజ్, ఉమేశ్ యాదవ్, అశ్విన్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పుజారా 90, శ్రేయస్ అయ్యర్ 86 పరుగులతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 404 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 150 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 254 పరుగుల ఆధిక్యం టీమ్ఇండియాకు లభించింది.
బంగ్లాదేశ్‌ను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికి కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో సారి బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపాడు. శుభ్‌మన్(110), పుజారా(102 నాటౌట్) సెంచరీలు చేశారు. భారత్ తన రెండో ఇన్నింగ్స్ ను 258/2 స్కోర్ వద్ద డిక్లేర్ చేసి బంగ్లాకు 513 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ జాకీర్ హాసన్ సెంచరీ, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 84 పరుగులతో రాణించినప్పటికి బంగ్లా 324 పరుగులకే పరిమితమైంది.
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ విజయంతో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.