Ind Vs Pak : వారిద్ద‌రూ ఆటను మా నుంచి దూరం చేశారు.. ఓటమికి సాకులు చెప్పిన రిజ్వాన్

ఛాంపియన్స్ ట్రోఫీ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది.

By Medi Samrat  Published on  24 Feb 2025 7:42 AM IST
Ind Vs Pak : వారిద్ద‌రూ ఆటను మా నుంచి దూరం చేశారు.. ఓటమికి సాకులు చెప్పిన రిజ్వాన్

ఛాంపియన్స్ ట్రోఫీ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది. ఓటమి తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టు పోరాటం దాదాపు ముగిసిందని పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఆదివారం అంగీకరించాడు. భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి చెందిన‌ పాక్‌కు వరుసగా రెండో ఓటమి ఇది. గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ సెమీస్‌ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్ చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.

రిజ్వాన్ మాట్లాడుతూ.. మా పోరాటం దాదాపు ముగిసిందని చెప్పగలం. మిగతా మ్యాచ్‌ల ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఒక మ్యాచ్ మిగిలి ఉంది కాబట్టి కొంచెం ఆశ మిగిలి ఉంది. కెప్టెన్‌గా ఇలాంటి పరిస్థితులు నాకు నచ్చవు. మన విధి మన చేతుల్లో వుండాలి. జట్టులో 11 మంది కెప్టెన్లు ఉన్నారంటూ రిజ్వాన్ ప్రకటనలు గుప్పించాడు.. అయితే.. ఓటమితో నిరాశ చెందాడంటే.. నిజంగానే నిరాశకు గురయ్యాడో అర్థం కావడం లేదు. మైదానంలో నాటకాలాడుతూ అపఖ్యాతి పాలైన రిజ్వాన్.. ఎప్పుడైనా ఏదైనా చేయగలడు.. మాట్లాడగలడు అని విమ‌ర్శ‌లు ఉన్నాయి.

కోహ్లీ భారత్‌కు విజయాన్ని అందించాడు.. ముఖ్యంగా తన 51వ వన్డే సెంచరీని సాధించిన విరాట్ కోహ్లీ.. అతను ఎంత కష్టపడుతున్నాడో చూసి.. నేను ఆశ్చర్యపోతున్నాను. అతను ఫామ్‌లో లేడని ప్రపంచమంతా చెప్పుకుంటున్నా ఇంత పెద్ద మ్యాచ్‌లో అంత హాయిగా పరుగులు సాధించాడు. అతని ఫిట్‌నెస్, క్రమశిక్షణ ప్రశంసించదగినవి. అతడిని ఔట్ చేసేందుకు మేం తీవ్రంగా ప్రయత్నించాం.. ఈ ఫలితంతో నిరాశ చెందాం అని రిజ్వాన్ పేర్కొన్నాడు.

ఇంకా మాట్లాడుతూ.. మేము అన్ని విభాగాల్లో తప్పులు చేసాము.. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోయాము, బౌలర్లలో షహీన్ 8 ఓవర్లలో 74 పరుగులు ఇచ్చాడు. 2017లో పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. మేము ఈసారి టాస్ గెలిచాము, కానీ మాకు టాస్ ద్వారా ప్రయోజనం లభించలేదు. ఈ పిచ్‌పై 280 స్కోరు బాగుంటుందని అనుకున్నాం. మిడిల్ ఓవర్లలో భార‌త బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేసి మా వికెట్లను తీశారు. సౌద్ షకీల్, నేను మా భాగ‌స్వామం ముందుకు తీసుకువెళ్లాల‌ని కొంత‌ సమయం తీసుకున్నాము. ఆ తర్వాత తప్పుడు, చెడ్డ షాట్ సెల‌క్ష‌న్స్‌.. టీమిండియా బౌల‌ర్లు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు, అందుకే మేము 240 పరుగులకు ఆలౌట్ అయ్యాము. మ‌నం ఎప్పుడైతే ఓడిపోతామో.. అప్పుడు అన్ని విభాగాల్లో రాణించలేకపోయారని అర్థం అని చెప్పుకొచ్చాడు.

మొదట్లో మేము దాటిగా ఆడాము, కానీ వారు మా కంటే దూకుడుగా ఉన్నారు. మేము వారిని అధిగ‌మించాల‌ని అనుకున్నాము.. కానీ మేము అలా చేయలేదు. అబ్రార్ మాకు ఒక వికెట్ ఇచ్చాడు, కానీ భార‌త బ్యాట్స్‌మెన్‌ మరో ఎండ్‌లో చాలా బాగా ఆడారు. విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్‌లు ఆటను మా నుంచి దూరం చేశారు. మా ఫీల్డింగ్‌ను కూడా మెరుగుపరచుకోవాలి. ఈ మ్యాచ్‌లోనూ, చివరి మ్యాచ్‌లోనూ చాలా తప్పులు చేశాం. మేము వాటిపై పని చేయాల‌నుకుంటున్నామ‌ని పేర్కొన్నాడు.

Next Story