భారత్ సిరీస్ లో నిలిచేనా..?

IND vs ENG 4th T20I. నేడు జరగనున్న నాలుగో టీ20 భారత జట్టుకు కీలకంగా మారింది.

By Medi Samrat  Published on  18 March 2021 4:42 PM IST
IND vs ENG 4th T20I.

నేడు జరగనున్న నాలుగో టీ20 భారత జట్టుకు కీలకంగా మారింది. 5 టీ20ల సీరిస్‌లో ఇప్పటికే ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌లో నిలుస్తుంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. మొదటి టీ20 ఇంగ్లండ్ గెలవగా.. రెండో టీ20ని భారత్ కైవసం చేసుకుంది.. ఇక మూడో టీ20లో భారత్ ను చిత్తు చిత్తు చేసింది ఇంగ్లండ్ జట్టు. ఇక గురువారం నాలుగో టీ20 మ్యాచ్ లో భారత్ నెగ్గకపోతే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంది.

ఓడిపోయిన రెండు మ్యాచ్ లలో భారత్ పవర్ ప్లే లో సరిగా పరుగులు చేయలేకపోయింది. ఓపెనింగ్ భాగస్వామ్యం అన్నది భారత్ ను దెబ్బతీస్తూ ఉంది. ఓపెనర్ గా వచ్చిన కెఎల్ రాహుల్ మూడు టీ20 మ్యాచ్ లలోనూ ఘోరంగా విఫలమయ్యాడు. రోహిత్ శర్మ ఈ సిరీస్ లో ఆడింది ఒక్క మ్యాచ్ మాత్రమే.. ఇక పంత్, హార్దిక్ పాండ్యాల మెరుపుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. రాహుల్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌తోనే ఓపెనింగ్‌ చేయించాలనే యోచనలో భారత్‌ ముందుంది. బౌలింగ్‌లో భువనేశ్వర్, సుందర్‌ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా.. వికెట్లు తీయలేకపోతున్నారు. చహల్‌, శార్దూల్ ఠాకూర్ లు పరుగులు ఎక్కువగా ఇస్తుండడంతో భారత్ ను కష్టాల్లోకి నెట్టేస్తోంది.

బ్యాటింగ్ లో వరల్డ్ నెంబర్ 1 డేవిడ్ మలాన్ ఇంకా మెరుపులు మెరిపించకపోయినా.. బట్లర్, రాయ్ మంచి టచ్ లో ఉన్నారు. ఇంకా మోర్గాన్, బెన్ స్టోక్స్ కు పెద్దగా అవకాశం రాకుండానే ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ మ్యాచ్ ను ఫినిష్ చేస్తూ ఉంది. బౌలింగ్ లో కూడా అందరూ రాణిస్తూ ఉన్నారు. పేస్ అటాక్ ఇంగ్లండ్ కు ప్రధాన బలంగా మారింది. ఆర్చర్, వుడ్ లు భారత్ బ్యాట్స్మెన్ ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నాలుగో మ్యాచ్ లో భారతజట్టు ఎలాగైనా గెలిచి తీరాలని అనుకుంటూ ఉంది. ఈ మ్యాచ్ లోనే సిరీస్ నెగ్గాలని.. టెస్ట్ సిరీస్ లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తూ ఉంది.


Next Story