చెలరేగిన ఆసీస్ బ్యాట్స్‌మెన్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం
Ind vs Aus 3rd T20 : India Target 186. మూడో టీ20 మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్లు చెలరేగి ఆడారు.
By Medi Samrat Published on 8 Dec 2020 10:24 AM GMTమూడో టీ20 మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్లు చెలరేగి ఆడారు. ఓపెనర్ మాథ్యూ వేడ్ (80, 53 బంతుల్లో 7పోర్లు, 2 సిక్సర్లు), ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (54, 36 బంతుల్లో 3 పోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకాలతో రాణించడంతో.. ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు భారీ స్కోర్ సాధించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ శుభారంభం దక్కలేదు. 14 పరుగుల వద్దే ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను సుందర్ ఖాతా తెరవకముందే పెవిలియన్ చేర్చాడు. వన్ డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్(24, 23 బంతుల్లో 1 పోర్)తో కలిసి మరో ఓపెనర్ మాథ్యూ వేడ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. మరో వికెట్ పడకుండా వీరిద్దరూ ఆడితూచి ఆడారు. కొంచెం నిలదొక్కుకున్నాక.. ఈ జోడి బౌండరీలతో విరుచుకుపడింది. రెండో వికెట్‌కు వీరిద్దరు 65 పరుగులు జోడించారు. సుందర్ మరోసారి మాయ చేసి స్మిత్‌ను ఔట్ చేశాడు.
వేడ్ కు మాక్స్ వెల్ జతకలిసాక.. ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. స్విచ్ షాట్లుతో మాక్స్‌వెల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో వీరిద్దరు భారీ షాట్లకోసం యత్నించి పెవిలియన్ చేరగా.. చివరి రెండు ఓవర్లలో శార్దూల్, నటరాజన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆసీస్ స్కోర్ 186 పరిమితం చేశారు.