రాహుల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
IND 276/3 at stumps Day 1.లార్డ్స్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ భారీ స్కోరుకు బాటలు వేసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 13 Aug 2021 7:53 AM ISTలార్డ్స్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. ఓపెనర్లు రాణించిన వేళ తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్ లోకేశ్ రాహుల్ (248 బంతుల్లో 127 నాటౌట్; 12 ఫోర్లు, ఓ సిక్సర్), అజింక్యా రహానే(1) ఉన్నారు. రెండోరోజు మనవాళ్లు మరెన్ని పరుగులు జోడిస్తారనే దానిపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది
అనవసరంగా బ్యాటింగ్ అప్పగించాం..
వాతావరణం మేఘావృతమై ఉండడంతో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకుంది. స్వింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఇంగ్లాండ్ పేసర్లు నిప్పులు కక్కే బంతులు వేస్తుంటే.. ఒక్కో పరుగు చేసేందుకు టీమ్‌ఇండియా తంటాలు పడింది. తొలి 10 ఓవర్లలో 11 పరుగులే వచ్చాయి. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండడంతో ఎంతో సహనంతో బ్యాటింగ్ చేసిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (145 బంతుల్లో 83; 11 ఫోర్లు, ఒక సిక్సర్) తరువాత గేర్ మార్చాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో సామ్ కరన్ బౌలింగ్‌లో ఫ్లిక్‌తో బౌండరీ సాధించాడు. భారత్ కు ఇదే తొలి బౌండరీ. కరన్ తరువాతి ఓవర్‌లో రోహిత్ ఏకంగా నాలుగు పోర్లు బాదాడు. బ్యాక్ పుట్ పంచ్‌తో అతడు కవర్స్‌లో ఆడిన షాట్‌ను చూసి తీరాల్సిందే. ఈ క్రమంలో మరోసారి మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడగా.. టీమ్‌ఇండియా 46/0తో లంచ్‌కు వెళ్లింది. రెండో సెషన్‌లోనూ అదే జోరు కనబర్చిన రోహిత్ 83 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో రోహిత్ ఔట్ కాగా.. కాసేపటికే పుజారా (9) అతడిని అనుసరించాడు. ఈ రెండు వికెట్లు అండర్సన్ కే దక్కాయి.
తొలి మ్యాచ్‌లో తొలి బంతికే డకౌట్ అయిన కెప్టెన్ కోహ్లీ (42) ఈ సారి పట్టుదల కనబర్చగా.. రోహిత్ ఔటైన తర్వాత వేగం పెంచిన రాహుల్.. వరుసగా రెండో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అండర్సన్‌ను ఆచితూచి ఆడిన ఈ జోడీ.. ఇతర బౌలర్లను ధాటిగా ఎదుర్కొంది. గంటకు 150 కిలోమీటర్లకు తగ్గని వేగంతో మార్క్ వుడ్ బెంబేలెత్తిస్తున్నా.. ఏ మాత్రం తొందరపాటుకు పోని మనవాళ్లు నెమ్మదిగా స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. దీంతో భారత్ స్కోరు 200 దాటింది. రాహుల్ 212 బంతుల్లో సెంచరీ ని చేశాడు. మరి కాసేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా కోహ్లీ ఔట్ అయ్యాడు. వీరిద్దరు మూడో వికెట్ కు 117 పరుగులు జోడించారు. రహానేతో కలిసి రాహుల్ మరో వికెట్ పడకుండా తొలి రోజును ముగించాడు.