ఫాలో ఆన్ ముప్పు నుంచి టీమిండియాను బ‌య‌ట‌ప‌డేసిన రహానే, శార్దూల్

IND 260/6 at Lunch, trail by 209 as Rahane, Thakur lead fightback. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ మూడో రోజు ఆట కొనసాగుతోంది

By Medi Samrat  Published on  9 Jun 2023 5:12 PM IST
ఫాలో ఆన్ ముప్పు నుంచి టీమిండియాను బ‌య‌ట‌ప‌డేసిన రహానే, శార్దూల్

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ మూడో రోజు ఆట కొనసాగుతోంది. ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా జ‌ట్ల మధ్య ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలి రెండు రోజుల్లో ఆస్ట్రేలియా పైచేయి సాధించగా.. భారత జట్టు తిరిగి పునరాగమనం చేసి ప‌ట్టు సాధించాల‌ని ఆశిస్తోంది.

ఈ క్ర‌మంలోనే శార్దూల్ ఠాకూర్, అజింక్యా రహానేలు ఏడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెల‌కొల్పారు. రహానే సెంచరీకి, శార్దూల్ హాఫ్ సెంచరీకి చేరువ‌య్యారు. వీరిద్దరి అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా భారత్ స్కోరు ఆరు వికెట్లకు 260 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు ఫాలో ఆన్ ముప్పు దాదాపుగా తప్పింది. ఇక‌ ఈ మ్యాచ్‌లో అజింక్య రహానే అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతోపాటు టెస్టు కెరీర్‌లో 5000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. శార్దూల్ ఠాకూర్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించాడు. ఆస్ట్రేలియా పేలవమైన ఫీల్డింగ్ కారణంగా.. ఇద్దరు ఆటగాళ్లు క్రీజులో నిల‌దొక్కుకున్నారు. ప్ర‌స్తుతం మూడో రోజు లంచ్ విరామ స‌మ‌యానికి టీమిండియా ఆరు వికెట్ల న‌ష్టానికి 260 ప‌రుగులు చేసి 206 ప‌రుగుల వెన‌క‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో గెల‌వాల‌ని ఇరు జ‌ట్లు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఎవ‌రు టెస్టు ఛాంపియ‌న్ అవ‌తార‌నే విష‌య‌మై తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది.


Next Story