అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ నేడే.. ఐదో టైటిల్ లక్ష్యంగా బరిలోకి యువ భారత్
ICC U19 World Cup 2022 Final today.వెస్టిండీస్‌లో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 5 Feb 2022 1:35 PM ISTవెస్టిండీస్‌లో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ప్రపంచకప్ కోసం నేడు జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ఐదో సారి అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించాలని యువ భారత్ ఆరాటపడుతోండగా.. 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. రెండో సారి టైటిట్‌ను గెలవాలని ఇంగ్లాండ్ బావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అంటిగ్వా వేదికగా రసవత్తరపోరు జరగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటి వరకు ఓటమే లేకుండా ఫైనల్‌కు చేరుకోవడం విశేషం.
సీనియర్ జట్టులోకి అడుగుపెట్టే దిశగా.. ఐపీఎల్ ప్రాంచైజీల దృష్టిలో పడేందుకు ఈ మ్యాచ్ కుర్రాళ్లకు గొప్ప అవకాశం. అందుకనే ఈ మ్యాచ్‌లో సత్తాచాటి టైటిల్ కొట్టేయాలనే పట్టుదలతో యువ ఆటగాళ్లు ఉన్నారు. వరుస విజయాలతో భారత కుర్రాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మ్యాచ్‌లు జరుగుతున్న కొద్దీ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా మారింది. బౌలింగ్ దళం దుర్భేద్యంగా తయారైంది. ఇక సెమీస్‌లో విఫలమైన ఓపెనర్లు ఫైనల్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ యశ్, ఆంధ్రా ఆటగాడు షేక్ రషీద్ మరోసారి బ్యాట్ ఝళిపిస్తే టీమ్ఇండియాకు తిరుగుండదు.
అయితే.. ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. ఆ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తుదిపోరుకు చేరుకుంది. ఆ జట్టు కెప్టెన్ టామ్ ప్రెస్ట్(292) టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించి ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉండగా.. జాకోబ్ బెతెత్, జార్జ్‌బెల్, అలెక్స్ హార్టన్ ఫామ్‌లో ఉన్నారు వీళ్లను భారత బౌలర్లు ఎంత త్వరగా పెవిలియన్ చేరుస్తారు అనే దానిపైనే విజయావశాలు ఆధారపడి ఉన్నాయి.