Test Rankings : బుమ్రాకు కింద‌కు నెట్టిన‌ రబాడ.. టాప్-10 నుంచి నిష్క్రమించిన‌ పంత్, కోహ్లీ

భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో, చివరి టెస్టు నవంబర్ 1 నుంచి జరగనుంది

By Medi Samrat  Published on  30 Oct 2024 4:41 PM IST
Test Rankings : బుమ్రాకు కింద‌కు నెట్టిన‌ రబాడ.. టాప్-10 నుంచి నిష్క్రమించిన‌ పంత్, కోహ్లీ

భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో, చివరి టెస్టు నవంబర్ 1 నుంచి జరగనుంది. కివీస్ జట్టు మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. పూణె టెస్ట్ తర్వాత ICC ఇటీవల తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో కగిసో రబడ జస్ప్రీత్ బుమ్రా నుండి నంబర్-1 బౌలర్ ట్యాగ్‌ను లాక్కున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో కగిసో రబాడ 9 వికెట్లు తీసి సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ కారణంగా అతడు రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి చేరుకున్నాడు.

కగిసో రబాడ అగ్రస్థానానికి చేరుకున్నాడు. హాజిల్‌వుడ్ రెండో స్థానంలో ఉండగా, బుమ్రా, అశ్విన్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. న్యూజిలాండ్‌పై ఐదు వికెట్లు పడగొట్టినప్పటికీ రవిచంద్రన్ అశ్విన్ రెండు స్థానాలు పడిపోయి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. అతని సహచర బౌలర్ రవీంద్ర జడేజా కూడా మూడు వికెట్లు మాత్రమే పడగొట్టడంతో రెండు స్థానాలు దిగజారి ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు.

గత వారం ఇంగ్లండ్‌తో పాకిస్థాన్ ఆడిన సిరీస్‌లో నమన్ అలీ కీలక పాత్ర పోషించాడు. ఈ సమయంలో అతను 9 వికెట్లు తీశాడు. ఇందులో రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు. దీంతో ఎనిమిది స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్ 10లో చేరి కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు 759కి చేరుకున్నాడు. అదే సమయంలో పుణెలో భారత్‌పై న్యూజిలాండ్‌కు చెందిన లెఫ్టార్మ్ బౌలర్ మిచెల్ సాంట్నర్ 13 వికెట్లతో 30 స్థానాలు ఎగబాకి 44వ స్థానానికి చేరుకున్నాడు.

దీంతో పాటు బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర ఎనిమిది స్థానాలు ఎగబాకి 10వ స్థానానికి చేరుకోగా.. ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రిషబ్ పంత్, విరాట్ కోహ్లిలు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-10 జాబితా నుండి నిష్క్రమించారు. పంత్‌ ఐదు స్థానాలు కోల్పోయి టాప్‌-10లో నిలిచి నేరుగా నంబర్‌-11కి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా ఒకేసారి 6 స్థానాలు కోల్పోయాడు. అతను ఇప్పుడు 688 రేటింగ్ పాయింట్ల‌తో 14వ స్థానానికి చేరుకున్నాడు.

Next Story