మహిళల టీ20 ప్రపంచకప్ వేదికను బంగ్లాదేశ్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం మార్చేసింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగనున్న ఈ గ్లోబల్ టోర్నమెంట్ ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరగనుంది. బంగ్లాదేశ్‌లో భారీ అల్లకల్లోలం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌లో అరాచక పరిస్థితులు నెలకొనడంతో మాజీ ప్రధాని షేక్ హసిన్ తన పదవిని.. దేశాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే.
మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఇప్పుడు దుబాయ్, షార్జాలో జరగనున్నాయి. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చిరస్మరణీయమైన ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమైందని.. హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మహిళల T20 ప్రపంచ కప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వకపోవడం నిరాశపరిచిందని ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డైస్ అన్నారు.