భారత్ నుంచి తరలిపోయిన టీ20 ప్రపంచకప్
ICC Men's T20 World Cup 2021 to be Held in UAE.అనుకున్నట్లే జరిగింది. భారత్ నుంచి టీ20 ప్రపంచకప్ తరలిపోయింది.
By తోట వంశీ కుమార్
అనుకున్నట్లే జరిగింది. భారత్ నుంచి టీ20 ప్రపంచకప్ తరలిపోయింది. టోర్ని జరగాల్సిన అక్టోబరు-నవంబరు నెలల్లో దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎలా ఉంటుందో అంచనా వేయలేని స్థితిలో పొట్టి కప్పును యూఏఈ వేదికగా నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌గంగూలి అధికారికంగా ప్రకటించారు. టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 17న మొదలై.. నవంబర్ 14న ముగుస్తుందని వెల్లడించారు. టోర్నీ నిర్వహణకు సంబంధించి తుది నిర్ణయం వెల్లడించేందుకు ఈ రోజే ఆఖరి రోజు కావడంతో సోమవారం బీసీసీఐ ఆఫీస్ బేరర్లు సమావేశమై ఈ మేరకు నిర్ణయించారు.
ఈ మెగా టోర్నీ కంటే ముందు యూఏఈలోనే ఐపీఎల్ జరగబోతోంది. మధ్యలో ఆగిన ఐపీఎల్‌ను సెప్టెంబరు 19న పునఃప్రారంభించే అవకాశముంది. ఆ టోర్నీ అక్టోబరు 15న ముగియనుంది. అంటే ఐపీఎల్ ముగిసిన రెండు రోజులకే టీ20 ప్రపంచకప్ ఆరంభమవుతుందన్న మాట. టీ20 ప్రపంచకప్ తొలి రౌండ్‌లో టాప్-8 జట్లు పోటీ పడవు. అవి నేరుగా సూపర్-12 మ్యాచ్‌లు ఆడతాయి. టాప్-8లోని లేని బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, బమన్, పుపువా న్యూగినియా తొలి రౌండ్లలో తలపడతాయి. వీటిలో నాలుగు సూపర్-12 దశకు అర్హత సాధిస్తాయి. క్వాలిఫయర్స్ పోటీలు ఒమన్‌లో జరుగనుండగా, టోర్నీలోని మిగతా మ్యాచ్‌లకు దుబాయ్, అబుదాబి, షార్జాలు వేదికలు కానున్నాయి. 12 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి రౌండ్‌రాబిన్ లీగ్ మ్యాచులు ఆడతాయి. వీటిలో నాలుగు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబరు 24న సూపర్-12దశ ఆరంభమవుతుంది.