టీ20ల్లో కొత్త నిబంధన.. స్లో ఓవర్ రేట్లకు మ్యాచ్‌లోనే శిక్ష
ICC introduces in-match penalties for slow over-rates.క్రికెట్ లో అప్పుడప్పుడూ జట్లు స్లో ఓవర్ రేట్
By తోట వంశీ కుమార్ Published on 7 Jan 2022 4:54 PM ISTక్రికెట్ లో అప్పుడప్పుడూ జట్లు స్లో ఓవర్ రేట్(నిర్దేశిత సమయానికి ఓవర్ల కోటాను పూర్తి చేయకపోవడం) ను నమోదు చేస్తుంటాయి. అలాంటప్పుడు మ్యాచ్ ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జరిమానా విధిస్తుంటుంది. ఎన్ని ఓవర్లు తక్కువగా వేశారో దాన్ని బట్టి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో కోత విధించడంతో పాటు ఒక్కొసారి ఆ జట్టు కెప్టెన్‌పై ఒక్క మ్యాచ్ నిషేదం కూడా పడుతుంది. స్లో ఓవర్ కారణంగా మ్యాచ్‌లు ఆలస్యంగా ముగుస్తుండడంతో అభిమానులు కూడా తీవ్ర నిరుత్సాహానికి గురైయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఐసీసీ శుక్రవారం కొత్త నిబంధనను తీసుకువచ్చింది.
టీ 20 క్రికెట్‌లో స్లో ఓవర్ రేట్ బౌలింగ్ చేసే జట్టు ఇకపై మ్యాచ్‌లోనే అందుకు తగిన ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. నిర్దేశిత సమయానికి ఫీల్డింగ్ చేసే జట్టు ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతిని వేయాల్సి ఉంటుంది. అలా జరగని పక్షంలో ఆ సమయానికి ఎన్ని ఓవర్లు లేదా బంతులు వేయాల్సి ఉంటుందో మిగిలిన మ్యాచ్‌లో 30 అడుగుల సర్కిల్ వెలుపల ఉన్న ఫీల్డర్లలో ఒకరిని తగ్గించాల్సి ఉంటుంది.
అది బ్యాటింగ్ చేసే జట్టుకు అనుకూలంగా మారనుండగా.. బౌలింగ్ చేసే జట్టుకు తీవ్ర నష్టం కలిగించనుంది. సర్కిల్ బయట ఫీల్డర్లు తగ్గడంతో బ్యాట్స్‌మెన్లు యధేచ్చగా భారీ షాట్లు ఆడే అవకాశం ఉంది. ఈ నిబంధన ఈ నెల 16 నుంచి అమల్లోకి రానుంది. వెస్టిండీస్, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగే టీ20 సిరీస్‌తో ఈ నిబంధనను ప్రవేశ పెడుతున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిబంధనను ఇటీవల ఇంగ్లాడ్‌లో నిర్వహించిన ది హండ్రెడ్ లీగ్ ప్రయోగాత్మకంగా చేపట్టారు. అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఇక డ్రింక్స్ విరామ సమయాల్లో ఐసీసీ కొత్త సడలింపు ఇచ్చింది. దైపాక్షిక సిరీస్‌ల్లో టోర్నీ ప్రారంభానికి ముందే ఇరు జట్ల అంగీకారంతో ఇన్నింగ్స్ మధ్యలో ఆప్షనల్ డ్రింక్స్ బ్రేక్‌గా రెండున్నర నిమిషాల విరామం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది.