ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా జస్ప్రీత్ బుమ్రా

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2024 సంవత్సరానికి ICC ఉత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు.

By Medi Samrat  Published on  28 Jan 2025 6:21 PM IST
ICC క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా జస్ప్రీత్ బుమ్రా

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2024 సంవత్సరానికి ICC ఉత్తమ ఆటగాడిగా ఎంపికయ్యాడు. 2024లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు బుమ్రాకు ఈ అవార్డు లభించింది. గత ఏడాది ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్, టి20 ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ విజయంలో బుమ్రా ముఖ్యమైన పాత్ర పోషించాడు. అంతకుముందు సోమవారం బుమ్రా ఉత్తమ టెస్ట్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.

బుమ్రా ఇటీవలే టెస్టుల్లో 200 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 2024లో టెస్టు క్రికెట్‌లో బుమ్రా అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. అతను 13 మ్యాచ్‌లలో 14.92 సగటు, 30.16 స్ట్రైక్ రేట్‌తో 71 వికెట్లు తీశాడు. స్వదేశంలో ఫాస్ట్ బౌలర్లకు కఠినమైన పరిస్థితులు ఉన్నా.. బుమ్రా ఏడాది పొడవునా ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

బుమ్రాతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్, ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్, హ్యారీ బ్రూక్ కూడా ఈ అవార్డు రేసులో పోటీప‌డ్డారు. అయితే బుమ్రా వారందరినీ దాటి సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డును గెలుచుకున్నాడు. భారత్ నుంచి ఈ ఘనత అందుకున్న ఐదో ఆటగాడు బుమ్రా. అతని కంటే ముందు రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ టెండూల్కర్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2017, 2018) కూడా ఈ అవార్డును గెలుచుకున్నారు.

స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఏడాది ఆరంభించాడు. అమెరికా, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా మరోసారి ఆకట్టుకున్నాడు. టోర్నీలో 8.26 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ టైటిల్ గెలుచుకుంది.. ఇందులో బుమ్రా సహకారం కూడా చాలా ముఖ్యమైనది.

Next Story