ఉత్కంఠ పోరులో హైద‌రాబాద్ విజ‌యం.. సాంకేతికంగా ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవం

Hyderabad defeat Mumbai by 3 runs.ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకోవాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచులో హైద‌రాబాద్ జ‌ట్టు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 May 2022 8:25 AM IST
ఉత్కంఠ పోరులో హైద‌రాబాద్ విజ‌యం.. సాంకేతికంగా ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవం

ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకోవాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచులో హైద‌రాబాద్ జ‌ట్టు విజ‌యం సాధించింది. మంగ‌ళ‌వారం ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన మ్యాచులో స‌న్‌రైజ‌ర్స్ 3 ప‌రుగుల తేడాతో ముంబైని ఓడించింది. దీంతో వ‌రుస‌గా ఐదు ప‌రాజ‌యాల త‌రువాత గెలుపు రుచి చూసింది.

తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 193 ప‌రుగులు చేసింది. రాహుల్‌ త్రిపాఠి ( 76; 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థ‌శ‌త‌కంతో చెలరేగగా ప్రియమ్‌ గార్గ్‌ (42; 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నికోలస్‌ పూరన్‌ (38; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ముంబై బౌల‌ర్ల‌లో ర‌మ‌ణ్‌దీప్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులకు ప‌రిమిత‌మైంది. కెప్టెన్ రోహిత్‌ శర్మ ( 48; 36 బంతుల్లో2 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్ ( 43; 34 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌) లు తొలి వికెట్‌కు 95 ప‌రుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. ఈ ద‌శ‌లో హైద‌రాబాద్ బౌల‌ర్ ఉమ్రాన్ మాలిక్ ధాటికి ముంబై వ‌రుస‌గా వికెట్ల‌ను కోల్పోయింది. కిష‌న్‌తో పాటు తిల‌క్‌వ‌ర్మ‌, సామ్స్ భారీ షాట్లు ఆడ‌బోయి పెవిలియ‌న్‌కు చేరారు. 15 ఓవ‌ర్ల‌కు ముంబై 127/4 తో నిలిచింది.

ఆఖ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో 67 ప‌రుగులు చేయాల్సి ఉండగా.. ముంబై విజ‌యం సాధించ‌డం క‌ష్టంగానే అనిపించింది. అయితే.. టిమ్‌ డేవిడ్‌ (46; 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రైజర్స్‌ను భయపెట్టాడు. ఆఖర్లో పిడుగుల్లాంటి షాట్లతో ముంబైని గెలిపించినంత పనిచేశాడు. న‌ట‌రాజ‌న్ వేసిన 18వ ఓవ‌ర్‌లో అత‌ను ఐదు బంతుల్లో 4 సిక్స‌ర్లు బాదాడు. దీంతో విజ‌య‌స‌మీక‌ర‌ణం 13 బంతుల్లో 19గా మారింది. అయితే.. చివ‌రి బంతికి లేని సింగిల్ కోసం ప్ర‌య‌త్నించి డేవిడ్ ర‌నౌటైపోవ‌డంతో హైద‌రాబాద్ ఊపిరిపీల్చుకుంది. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. త్రిపాఠికి 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Next Story