బయో బబుల్ లోకి కరోనా ఎలా ఎంటర్ అయ్యింది.. గంగూలీ ఏమన్నారంటే ..?
How Did Coronavirus Enter IPL Bio-Bubble.బయో బబుల్ లో ఐపీఎల్ నిర్వహించినా కూడా కరోనా మహమ్మారి ఆటగాళ్లకు సోకింది.
By తోట వంశీ కుమార్ Published on 6 May 2021 4:05 PM ISTబయో బబుల్ లో ఐపీఎల్ నిర్వహించినా కూడా కరోనా మహమ్మారి ఆటగాళ్లకు సోకింది. దీంతో ఐపీఎల్ ను రద్దు చేస్తున్నట్లుగా బీసీసీఐ ప్రకటించింది. దీంతో క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు. ఇక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయో బబుల్ లోకి కరోనా రావడంపై స్పందించారు. కఠిన నిబంధనలు ఉండే బయో బబుల్ లోనూ కరోనాను కట్టడి చేయడం కష్టసాధ్యమని.. యూకేలో నిర్వహించిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నీలోనూ పలువురు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారని గంగూలీ వివరించారు. ఐపీఎల్ 14వ సీజన్ లో బయో బబుల్ ఉల్లంఘనలు ఏవైనా జరిగాయా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, బోర్డుకు అందిన నివేదిక ప్రకారం బయో బబుల్ అతిక్రమణలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. బయో బబుల్ లో ఉన్న వాళ్లు కరోనా బారిన ఎలా పడ్డారన్నది చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు దేశంలో ఇంతమందికి కరోనా ఎలా సోకుతోందన్నది చెప్పడం కూడా చాలా కష్టమని అన్నారు గంగూలీ. ప్రపంచవ్యాప్తంగా నిపుణులు బయో బబుల్ లో కరోనా చొరబడకుండా నివారించలేక పోతున్నారు. ఇంగ్లండ్ లో సెకండ్ వేవ్ సందర్భంగా ఫుట్ బాల్ లీగ్ లో కరోనా కలకలం రేగింది.. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో మాంచెస్టర్ సిటీ, ఆర్సెనల్ క్లబ్ లకు చెందిన ఆటగాళ్లకు కరోనా సోకిందని వివరించారు.
అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ బిజీగా ఉండడంతో ఐపీఎల్ ను రీషెడ్యూల్ చేయడం ఎంతో ప్రయాసతో కూడుకున్న పని అని గంగూలీ చెప్పుకొచ్చారు. సుదీర్ఘ సమయం పాటు జరిగే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో కరోనా కలకలం రేగితే వాళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రీషెడ్యూల్ చేసుకోడానికి కారణం ఆ లీగ్ ను ఆర్నెల్లు నడిపించడమేనని చెప్పుకొచ్చారు. క్రికెట్ అలా కాదని, ఐపీఎల్ పోటీలు జరిగే సమయంలో కొన్ని దేశాల జట్లు మ్యాచ్ లు ఆడుతుంటాయని.. ఆ జాతీయ జట్లకు ఐపీఎల్ ఆటగాళ్లను విడుదల చేయాల్సి ఉంటుందని అన్నారు.
ఇక ఐపీఎల్ 14వ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లు యూఏఈలో జరిపేందుకు చర్చలు జరుగుతున్నాయని, అప్పటికి భారత్ లో ఎక్కువ కేసులు లేకపోతే స్వదేశంలోనే నిర్వహిస్తామని అన్నారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తోపాటు కోల్‌కతా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌లోని ప్లేయర్స్, సిబ్బందికి కరోనా సోకింది. రోజు రోజుకీ వైరస్ బారిన పడుతున్న వాళ్ల సంఖ్య పెరిగిపోతుండటంతో లీగ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఐపీఎల్ నిర్వహించడం తప్పు కాదని.. అయితే ఆరు వేదికల్లో క్యారావాన్ మోడల్‌లో నిర్వహించడమే పొరపాటని అన్నారు. కరోనా వ్యాపిస్తున్న సమయంలో రెండు నగరాల మధ్య ఫ్రాంచైజీలను ప్రయాణాలకు అనుమతించడం వల్లే కరోనా బారిన పడ్డారని గంగూలీ తెలిపారు. ఒకే నగరానికి ఐపీఎల్‌ను పరిమితం చేసి ఉంటే ఈ సీజన్ అసలు వాయిదా వేయాల్సి వచ్చేది కాదని గంగూలీ చెప్పుకొచ్చారు.