క్రౌన్ పెర్త్.. ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టును ఉంచిన హోటల్.. తాజాగా ఆ హోటల్ లో విరాట్ కోహ్లీ గదికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. విరాట్ కోహ్లీ గదికి సంబంధించిన వీడియో ఫుటేజీని రికార్డ్ చేయడం ద్వారా విరాట్ కోహ్లీ గోప్యతను భంగం వాటిల్లింది. ఈ విషయంపై హోటల్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది, ఈ చర్యకు కారణమైన వ్యక్తులను తొలగించినట్లు సమాచారం. అనుమతి లేకుండా కోహ్లి గదిలోకి ప్రవేశించినందుకు హోటల్ క్షమాపణలు చెప్పింది. అలాంటి సంఘటన మళ్లీ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చింది.
క్రౌన్ పెర్త్‌లో అతిథుల భద్రత, గోప్యత మా ప్రథమ ప్రాధాన్యత, ఈ సంఘటన జరిగినందుకు మేము చాలా నిరాశ చెందామని హోటల్ ప్రకటనలో తెలిపింది. మేము నిస్సందేహంగా క్షమాపణలు కోరుతున్నాము. సమస్యను సరిదిద్దడానికి క్రౌన్ తక్షణమే చర్యలు తీసుకుంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులను విధుల నుండి తీసివేశామని తెలిపింది. ఇలాంటి సంఘటన మళ్లీ జరగకుండా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.
విరాట్ కోహ్లీ గదికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. విరాట్ తన వస్తువులను ఎలా జాగ్రత్తగా పెట్టుకున్నాడో, షూ కలెక్షన్స్, అతను వాడే వస్తువులు ఇలా ప్రతీది వీడియోలో చూపించారు. చివరకు బాత్ రూమ్‌ను కూడా వదలలేదు. విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. నా గదికి సంబంధించిన వీడియోను చూసి నేను షాకయ్యాను. ఇది నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉంది. నా హోటల్ రూమ్‌లో కూడా నాకు ప్రైవసీ లేకుంటే ఎలా..? ఇలాంటి అభిమానాన్ని నేను ప్రోత్సహించనని అన్నాడు కోహ్లీ.