నికోల్స్‌ను వెంటాడిన దుర‌దృష్టం.. ఇలా కూడా ఔట్‌ అవ్వొచ్చా

Henry Nicholls gets dismissed in bizarre manner.లీడ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో న్యూజిలాండ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Jun 2022 9:32 AM GMT
నికోల్స్‌ను వెంటాడిన దుర‌దృష్టం.. ఇలా కూడా ఔట్‌ అవ్వొచ్చా

లీడ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ హెన్రీ నికోల్స్ విచిత్రంగా ఔట్ అయ్యాడు. కివీస్ ఇన్నింగ్స్ 55 ఓవ‌ర్‌ను ఇంగ్లాండ్ బౌల‌ర్ జాక్ లీచ్ వేశాడు. ఆ ఓవ‌ర్‌లో రెండో బంతిని నికోల్స్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే.. ఆ బంతి కాస్తా నాన్ స్ట్రైక‌ర్ ఎండ్‌లో నిలుచున్న మిచెల్ వైపు రావ‌డంతో అత‌డు త‌ప్పించుకునేందుకు య‌త్నించాడు. ఈ క్ర‌మంలో బంతి అత‌డి బ్యాట్‌కు త‌గిలి గాల్లోకి లేచింది. అక్క‌డే ఫీల్డింగ్ చేస్తున్న అలెక్స్ చేతుల్లో ప‌డింది. దీంతో ఇంగ్లాండ్ ఆట‌గాళ్లు సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇక మ్యాచ్ అనంత‌రం ఈ విష‌యంపై ఇంగ్లాండ్ బౌల‌ర్ లీచ్ మాట్లాడుతూ.. నికోల్స్ ఇలా ఔట్ కావ‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌న్నాడు. అయితే.. క్రికెట్ అనేది స‌ర‌దా గేమ్ అని, ఇలాంటిది తాను ఎప్పుడు చూడ‌లేద‌న్నాడు. ఏదీ ఏమైనా వాటిని స్వీక‌రించాల‌న్నాడు. వికెట్ ద‌క్క‌డం త‌న అదృష్ట‌మ‌ని, నికోల్స్‌ను దుర‌దృష్టం వెంటాడింద‌ని తెలిపాడు.

కాగా.. నికోల్స్‌ ఔటైన విధానంపై మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ స్పందించింది. దురదృష్టకరమైన రీతిలో నికోల్స్‌ తన వికెట్‌ను కోల్పోయాడు. అయితే.. ఇది పూర్తిగా నిబంధ‌న‌ల‌కు లోబడి ఉంది. ​33.2.2.2 ప్రకారం బంతి.. వికెట్‌, అంపైర్‌, ఫీల్డర్, ఇతర బ్యాటర్‌ని తాకిన తర్వాత క్యాచ్ తీసుకుంటే అది ఔట్‌గా పరిగణించబడుతుంది అని మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ‍ట్వీట్ చేసింది.

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. గురువారం ప్రారంభ‌మైన ఈ టెస్టులో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. డారిల్ మిఛెల్-78, టామ్ బ్లండెల్ 45 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

Next Story