భారత్ చేతిలో ఓటమి.. టీవీని పగలగొట్టిన పాక్ అభిమాని
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్...
By - అంజి |
Video: భారత్ చేతిలో ఓటమి.. టీవీని పగలగొట్టిన పాక్ అభిమాని
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. టీ20 చరిత్రలో పాక్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన భారత్, పాకిస్థాన్‌ను కనీస పోటీ ఇవ్వని స్థితిలోకి నెట్టేసింది.
టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ, భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 40 బంతుల్లో 77 పరుగులు చేసిన ఇషాన్, పాక్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 175/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 52/1తో పటిష్ట స్థితిలో ఉండగా, పాక్ బౌలర్లు ఏ దశలోనూ భారత రన్ రేట్‌ను నియంత్రించలేకపోయారు.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు భారత పేసర్లు చుక్కలు చూపించారు. జస్‌ప్రీత్ బుమ్రా (2/17), హార్దిక్ పాండ్యా (2/16) ఆరంభంలోనే వికెట్లు తీసి పాక్ వెన్ను విరిచారు. కేవలం 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పాక్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయింది. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, బాబర్ ఆజం వంటి కీలక ఆటగాళ్లు నిరాశపరిచారు. బాబర్ ఆజంను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో పాక్ పతనం ఖాయమైంది. ఆఖరిలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి తమ స్పిన్ మాయాజాలంతో పాక్‌ను 114 పరుగులకే ఆలౌట్ చేశారు.
పగిలిన టీవీలు.. పాక్ అభిమానుల ఆవేదన
ఈ ఓటమి పాక్ అభిమానులను తీవ్రంగా కలిచివేసింది. సోషల్ మీడియాలో ఒక అభిమాని తన టీవీని పగలగొట్టిన వీడియో వైరల్‌గా మారింది. "భారత్ మళ్ళీ గెలిచింది, ఆ నిరాశలో నా టీవీ పగలగొట్టుకున్నాను. చాలా అవమానంగా, షాకింగ్‌గా ఉంది" అంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు.
స్టేడియం బయట మక్బూల్ అనే అభిమాని మాట్లాడుతూ.. "బుమ్రాను ఎదుర్కోవడం మా వల్ల కావడం లేదు, హార్దిక్‌ను తట్టుకోలేకపోతున్నాం. భారత్ హోంవర్క్ చాలా బాగుంది. గత 20-25 ఏళ్లుగా భారత్ మాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది" అని వాపోయాడు.
రికార్డులు ఏం చెబుతున్నాయి?
ఈ విజయంతో టీ20 ప్రపంచకప్‌లలో పాకిస్థాన్‌పై భారత్ రికార్డు 8-1కి చేరుకుంది. కొలంబో గడ్డపై పాకిస్థాన్ కంటే భారత్ తక్కువ సమయం ప్రాక్టీస్ చేసినప్పటికీ, మైదానంలో చూపిన పట్టుదల టీమ్ ఇండియాను విజేతగా నిలిపింది.