INDIA Vs SOUTH AFRICA: భారత్ ఓటమిపై గంభీర్ గుస్సా!!
ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు ఓటమిపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఓటమికి పిచ్‌ను కారణంగా చూపడాన్ని తోసిపుచ్చారు.
By - అంజి |
INDIA Vs SOUTH AFRICA: భారత్ ఓటమిపై గంభీర్ గుస్సా!!
ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు ఓటమిపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఓటమికి పిచ్‌ను కారణంగా చూపడాన్ని తోసిపుచ్చారు. అసలు తప్పు పిచ్‌ది కాదని, భారత బ్యాటర్ల వైఫల్యమే ఓటమి కారణమని మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ అన్నారు. తాము ఎలాంటి పిచ్ కావాలని కోరామో, క్యురేటర్ సరిగ్గా అలాంటి పిచ్‌నే తయారు చేశాడని, అందుకు తాము సంతోషంగా ఉన్నామని తెలిపాడు. ఇలాంటి పిచ్‌పై సరిగ్గా ఆడకపోతే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఇది ఆటకు పనికిరాని వికెట్ ఏమీ కాదు. ఆటగాళ్ల టెక్నిక్, టెంపర్మెంట్‌ను పరీక్షించే వికెట్ ఇది.
పటిష్టమైన డిఫెన్స్ ఉంటే ఇలాంటి పిచ్‌లపై కూడా పరుగులు సాధించవచ్చని గంభీర్ అన్నాడు. నా అభిప్రాయం ప్రకారం 123 పరుగులు సులభంగా ఛేదించాల్సిన లక్ష్యమే. పరుగులు చేయాలంటే సరైన మానసిక దృక్పథం ఉండాలి. సరిగ్గా ఆడనప్పుడు ఇలాంటి పరాజయాలు తప్పవు. ఈ పిచ్ లో ఎలాంటి దెయ్యాలు లేవు. అక్షర్ పటేల్, టెంబా బవుమా పరుగులు చేశారు కదా? అలాంటప్పుడు మన జట్టులోని మిగతా బ్యాటర్లు ఎందుకు విఫలమయ్యారని గంభీర్ ప్రశ్నించాడు. ఇది కేవలం స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్ కాదని, ఆటగాళ్ల మానసిక దృఢత్వాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని, నిలకడను సవాలు చేసే వికెట్ అని పేర్కొన్నాడు.
కేఎల్ రాహుల్, టెంబా బవుమా, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు పటిష్టమైన డిఫెన్స్‌తో ఆడారని, మిగతావారు ఆ స్ఫూర్తిని ప్రదర్శించలేకపోయారని గంభీర్ విమర్శించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు సంచలనం సృష్టించింది. 124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత జట్టు 93 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ (4/21) తన స్పిన్ మాయాజాలంతో టీమిండియా పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. 15 ఏళ్ల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికాకు ఇదే తొలి టెస్టు విజయం.