వరల్డ్‌కప్ మ్యాచ్‌ల నిర్వహణపై BCCIకి షాక్ ఇచ్చిన HCA
కొత్తగా ప్రకటించిన వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐని కోరింది.
By Srikanth Gundamalla Published on 20 Aug 2023 5:25 AM GMTవరల్డ్‌కప్ మ్యాచ్‌ల నిర్వహణపై BCCIకి షాక్ ఇచ్చిన HCA
భారత్ వేదిక వన్డే వరల్డ్ కప్-2023 మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్ ఆతిథ్యం ఇవ్వనుండటంతో క్రికెట్ అభిమానులు చాలా సంతోష పడ్డారు. దాదాపు అన్ని మ్యాచ్‌లను లైవ్‌లోనే వెళ్లి ఏంజాయ్ చేయొచ్చని అనుకున్నారు. కానీ.. భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే వరల్డ్ కప్‌కు రోజుకో సమస్య వచ్చి పడుతోంది. మరో 46 రోజుల్లోనే ఈ మెగా ఈవెంట్ జరగనున్నా.. ఐసీసీ, బీసీసీఐకి మరో తలనొప్పి వచ్చి పడింది. కొత్తగా ప్రకటించిన వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐని కోరింది.
అయితే.. అంతకు ముందే వన్డే వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహించాల్సిన గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు ఊహించని అడ్డంకి వచ్చిపడింది. భారత్-పాక్ మ్యాచ్ నిర్వహణ సమయంలో నవరాత్రి ఉత్సవాలు ఉంటాయని.. దాంతో మ్యాచ్‌కు భద్రత కల్పించలేమంటూ రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. అదే విషయాన్ని బీసీసీఐకి గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. కానీ.. అప్పటికే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకటించి నెల రోజులు గడిచిపోయింది. ఆ తర్వాత మరో పది రోజుల్లోనే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఇలాంటి అభ్యర్థనే చేసింది. కాళీ పూజ కారణంగా తమ గ్రౌండ్స్‌లో జరిగే మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని.. షెడ్యూల్ చేంజ్ చేయాలని బీసీసీఐని కోరింది.
రెండు బోర్డుల విజ్ఞప్తి మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రెస్‌మీట్ నిర్వహించి.. ఈ నెల 9న కొత్త షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇక అంతా అయిపోయింది. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు ఉంటాయని అందరూ భావించారు. మరో వారం రోజుల్లో టికెట్ విక్రయాలను కూడా ప్రారంభించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. అంతలోనే హెచ్‌సీఏ మరో షాక్ ఇచ్చింది. బీసీసీఐకి ఒక విజ్ఞప్తి చేసింది. వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం.. హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 9న న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మ్యాచ్ ఉంది. ఆ తర్వాత మరుసటి రోజే అంటే అక్టోబర్ 10వ తేదీన పాకిస్థాన్-శ్రీలంక మ్యాచ్ జరగాల్సి ఉంటుంది. ఇలా వరుస రోజుల్లో మ్యాచ్‌లకు భద్రత కల్పించడం తమకు కష్టం అవుతుందని హైదరాబాద్ పోలీసులు హెచ్‌సీఏకు తెలిపినట్లు సమాచారం.
దాంతో.. హైదరాబాద్ పోలీసుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హెచ్‌సీఏ.. అదే విషయాన్ని బీసీసీకి లేఖలో రాసి పంపింది. కాగా.. ఫస్ట్ షెడ్యూల్ ప్రకారం అయితే పాకిస్తాన్-శ్రీలంక మ్యాచ్ అక్టోబర్ 12న జరగాల్సింది. కానీ.. కొత్త షెడ్యూల్‌లో మార్పుల తర్వాత మ్యాచ్ రెండ్రోజుల ముందే వచ్చింది. దాంతో.. వరుసగా రెండు రోజులు హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే బీసీసీఐకి హెచ్‌సీఏ లేఖ రాసింది. మరి హెచ్‌సీఏ విజ్ఞప్తిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.