ఓ వైపు ఫుల్ ప్రాక్టీస్.. మరో వైపు చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్

Hazlewood Out Of IPL 2021.చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ తగిలింది. ఆసీస్ పేసర్ జోష్ హజిల్‌వుడ్, ఈ సంవత్సరం లీగ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2021 5:37 PM IST
Hazlewood Out Of IPL 2021

ఐపీఎల్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి. మహేంద్ర సింగ్ ధోని మెరుపులు చూడడానికి క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ జట్టు సోషల్ మీడియా అకౌంట్లలో ఆటగాళ్లకు సంబంధించిన వీడియోలను చూడొచ్చు. ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ నెట్స్ లో తీవ్రంగా సాధన చేస్తోంది. నెట్స్ లో కెప్టెన్ ధోనీ, రైనా సహా మిగతా ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత ధోనీ, రైనాలు గ్రౌండ్ లోకి దిగారు. వ్యక్తిగత కారణాలతో రైనా గత ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. పీల్డింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. టీమ్ ఐపీఎల్ కెరీర్ లో ఎన్నడూ లేనంతగా ఏడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇక ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ తగిలింది. ఆసీస్ పేసర్ జోష్ హజిల్‌వుడ్, ఈ సంవత్సరం లీగ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దాదాపు 10 నెలల నుంచి బయో బబుల్‌, క్వారంటైన్‌లోనే జీవితాన్ని గడుపుతున్నానని.. ఐపీఎల్ తర్వాత కూడా బిజీ క్రికెట్ షెడ్యూల్లో ఆడబోతున్నామన్నాడు హజిల్. గత సంవత్సర కాలంగా విశ్రాంతి లేకుండా ఒక సిరీస్‌ నుంచి మరొక సిరీస్‌ ఆడుతూనే ఉన్నామని దీని కారణంగా మానసికంగా, శారీరకంగా అలసటగా భావిస్తున్నానని అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకుని కుటుంబంతో గడపాలని అనుకుంటున్నానని హజిల్‌వుడ్ తెలిపాడు. ఐపీఎల్ 2020 వేలంలో హాజల్‌వుడ్‌ను చెన్నై యాజమాన్యం 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలా అని చెన్నై యాజమాన్యం ఆలోచనలు చేస్తోంది.


Next Story