భారత స్టార్ ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యకు కస్టమ్స్ అధికారులు షాకిచ్చారు. కరోనా మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆడేందుకు యూఏఈకి వెళ్లాడు హర్దిక్ పాండ్య. ఐపీఎల్ ముగిసిన అనంతరం టీ20 ప్రపంచకప్ కోసం అక్కడే ఉండిపోయాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు కనీసం సెమీస్ చేరకుండానే నిష్ర్కమించింది. దీంతో ఆటగాళ్లు స్వదేశానికి తిరిగి వచ్చేశారు. అలా యూఏఈ నుంచి ఇండియాకు వచ్చిన పాండ్య వద్ద రెండు విదేశీ వాచ్‌లు ఉన్నట్లు ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
ఆ వాచ్‌లకు సంబంధించిన రశీదులు లేకపోవడంతో కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వాచీల విలువ రూ.5కోట్లు ఉంటుందని సమాచారం. నవంబరు 14న రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్య వద్ద అత్యంత ఖరీదైన, ప్రసిద్ధ కంపెనీలకు చెందిన వాచ్ కలెక్షన్ ఉంది. వీటిలో పటేక్ ఫిలిఫ్ నాటిలస్ ప్లాటినమ్ 5711 ప్రముఖమైంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌లో పాండ్య ఆశించినంతగా ఆకట్టులేకపోయాడు. వెన్నుముకకు సర్జరీ చేయించుకున్న తరువాత నుంచి పాండ్య చాలా తక్కువగా బౌలింగ్ చేస్తున్నాడు. ఓ బ్యాట్స్‌మెన్‌గానే కొనసాగుతున్నాడు. అయినప్పటికీ బ్యాట్స్‌మెన్‌గానూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.