చెన్నై లోని చెపాక్ వేదికగా జింబాబ్వేతో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ పూర్తవ్వగానే డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళలేదు. రెస్ట్ తీసుకోకుండా, నేరుగా గ్రౌండ్‌కి వెళ్లి శివమ్ దూబేతో కలిసి బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు.
జింబాబ్వేపై భారత్ 256 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. హార్దిక్ 3 ఓవర్లలో 21 పరుగులు ఇవ్వగా, శివమ్ దూబే 2 ఓవర్లలో ఏకంగా 46 పరుగులు ఇచ్చాడు. బౌలింగ్‌లో తమ తప్పులను సరిదిద్దుకుని, వెస్టిండీస్‌తో జరగబోయే తదుపరి నాకౌట్ మ్యాచ్‌కు సిద్ధమవ్వాలనే ఉద్దేశ్యంతోనే మ్యాచ్ ముగిసిన వెంటనే బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షణలో వీరిద్దరూ తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు.
హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే అంకితభావం చూసి క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ ఆశ్చర్యపోయారు. టీ20 వరల్డ్ కప్ ఎలాగైనా గెలవాలని భారత జట్టు ఎంత కసితో ఉందో చెప్పడానికి వీళ్ల ప్రాక్టీస్ ఒక ఉదాహరణ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మార్చి 1న కోల్‌కతా వేదికగా సెమీస్ బెర్త్ కోసం వెస్టిండీస్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.