ఈ రోజు మ్యాచ్ గెల‌వ‌డంతో పాటు క‌ప్ వాళ్లే కొడ‌తారు : భ‌జ్జీ

Harbhajan Singh makes big prediction on IPL 2022 winner.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2022 సీజ‌న్ చివ‌రి అంకానికి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2022 2:57 PM IST
ఈ రోజు మ్యాచ్ గెల‌వ‌డంతో పాటు క‌ప్ వాళ్లే కొడ‌తారు : భ‌జ్జీ

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్) 2022 సీజ‌న్ చివ‌రి అంకానికి చేరుకుంది. ఫైన‌ల్‌లో చోటు కోసం నేడు(శుక్ర‌వారం) రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ మ్యాచ్‌తో పాటు ఈ సారి క‌ప్‌ను రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు గెలుస్తుందని జోస్యం చెప్పాడు.

ఓ క్రీడా ఛాన‌ల్‌తో భ‌జ్జీ మాట్లాడుతూ.. ఈ సారి బెంగ‌ళూరు జ‌ట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నారని అన్నాడు. వారి బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగం రెండూ ప‌టిష్టంగా ఉన్నాయ‌న్నాడు. ఆ జట్టుకు ట్రోఫీ అందించగల సత్తా గల ప్లేయర్లు ఉన్నారు. దీంతో ఈ రోజు రాజ‌స్థాన్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ త‌ప్ప‌కుండా ఆధిప‌త్యం చెలాయిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ఇక ఫైన‌ల్‌లో కూడా గుజ‌రాత్‌ను ఓడించి తొలిసారి క‌ప్‌ను ఆ జ‌ట్టు అందుకుంటుంద‌ని త‌న మ‌న‌సు చెబుతోంద‌ని భ‌జ్జీ అన్నాడు.

బ‌ల‌మైన బెంగ‌ళూరు జ‌ట్టును ఓడించాలంటే రాజ‌స్థాన్ జ‌ట్టు త‌మ శ‌క్తి వంచ‌న మేర‌కు ఆడాల‌ని అప్పుడే కాస్త అవ‌కాశం ఉంటుంద‌న్నాడు. ఈ మ్యాచ్‌ను ఓ సాధార‌ణ మ్యాచ్‌లా బావించాల‌ని సూచించాడు. ఒత్తిడి గురికావొద్ద‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం బెంగ‌ళూరు జ‌ట్టును ఓడించ‌డం చాలా క‌ష్ట‌మైన విష‌యం అన్నాడు.

లీగ్‌లో అదృష్టం క‌లిసి వ‌చ్చి బెంగ‌ళూరు ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించిన సంగ‌తి తెలిసిందే. ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో ల‌క్నో ను ఓడించిన బెంగ‌ళూరు ఆట‌గాళ్లు ఆత్మ‌విశ్వాసంతో బ‌రిలోకి దిగ‌నున్నారు. ఇక లీగ్ స్టేజ్‌లో రెండో స్థానంతో ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెట్టిన రాజ‌స్థాన్‌.. క్వాలిఫ‌య‌ర్ 1లో గుజ‌రాత్ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు చేరుకోవాల‌ని ఇరు జ‌ట్లు ప‌ట్టుద‌ల‌గా ఉన్నాయి.

Next Story