ఒమన్‌లో చిక్కుకున్న యువతిని కాపాడిన హర్భజన్
Harbhajan Singh helps rescue girl held captive in Gulf Country.హర్భజన్ సింగ్ మంచి మనసును చాటుకున్నాడు.
By తోట వంశీ కుమార్ Published on 8 Sept 2022 12:09 PM ISTటీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మంచి మనసును చాటుకున్నాడు. ఏజెంట్ మోసంతో గల్ఫ్ దేశం ఒమన్‌లో చిక్కుకున్న యువతిని.. యజమాని చెర నుంచి కాపాడి స్వదేశానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.
వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని బఠిండా జిల్లా బార్‌కండి గ్రామంలో సికందర్‌సింగ్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఆయన దినసరి కూలీ. ఆయనకు ముగ్గురు కుమారైలు సంతానం. తండ్రికి ఆసరాగా నిలవాలన్న ఉద్దేశ్యంతో పెద్దమ్మాయి కమల్జీత్ కౌర్(21) స్థానిక ఏజెంట్ ను ఆశ్రయించింది. గల్ప్ దేశంలో ఓ భారతీయ కుటుంబంలో పనికి కుదుర్చుతామని చెప్పి ఆమెను గత నెలాఖరులో ఒమన్ రాజధాని మస్కట్ పంపించాడు.
అక్కడ ఒమన్ ఏజెంటు అర్బన్ విమానాశ్రయం నుంచి నేరుగా ఫలజ్ అల్ ఖబైల్ అనే చోటుకు తీసుకువెళ్లాడు. ఆ ప్రాంతానికి చేరుకోగానే కమల్జీత్ పాస్‌పోర్టు, సిమ్‌కార్డు లాక్కొన్నారు. అక్కడ మరో 20 మందికి పైగా మహిళలు ఉన్నారు. తనచేత బలవంతంగా బుర్జా ధరింపజేసి అరబిక్ భాష నేర్చుకోవాలని ఆదేశించారు. తాను మోసపోయినట్లు గుర్తించిన కమల్జీత్ ఎలాగోలా కొత్త సిమ్‌కార్డ్ సంపాదించింది. అనంతరం తన తండ్రికి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పేసింది.
ఈ విషయం అక్కడ ఉన్నవారికి తెలిసి కమల్జీత్‌ను కొట్టారు. తన కుమారైను రక్షించుకోవాలని బావించిన కమల్జీత్ తండ్రి.. ఇంటిని తాకట్టు పెట్టి రూ.2.5లక్షలు స్థానిక ఏజెంట్‌కు ఇచ్చాడు. ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక నేతల ద్వారా విషయం హర్భజన్ సింగ్‌కు తెలిసింది. వెంటనే స్పందించిన హర్భజన్ సింగ్ ఒమన్‌లోని భారత ఎంబసీ అధికారులతో మాట్లాడారు. సాయం చేయాల్సిందిగా కోరారు. ఎంబసీ అధికారుల చొరవతో సెప్టెంబర్ 3న కమల్జీత్ మస్కట్‌లో భారత విమానం ఎక్కి సురక్షితంగా ఇంటికి చేరింది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేటప్పుడు, అందులోనూ ఆడవాళ్లు జాగ్రత్తగా ఉండాలని భజ్జీ సూచించారు.