చెన్నై సూపర్ కింగ్స్ కు వీడ్కోలు పలికిన భజ్జీ

Harbhajan Singh Announces End Of IPL Contract With Chennai Super Kings. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు స్పిన్నర్ హర్భజన్ వీడ్కోలు.

By Medi Samrat
Published on : 20 Jan 2021 6:49 PM IST

Harbhajan Singh

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు స్పిన్నర్ హర్భజన్ సింగ్ వీడ్కోలు పలికాడు. బుధవారం ట్విట్టర్ లో చెన్నైతో తన ఒప్పందం పూర్తయిపోయిందని వెల్లడించాడు. ''చెన్నైతో నా ఒప్పందం పూర్తయింది. ఆ టీమ్ తో ఆడడం గొప్ప అనుభవం. ఎన్నెన్నో అందమైన జ్ఞాపకాలను నా సొంతం చేసుకున్నా. ఎన్నోఏళ్ల పాటు గుర్తుంచుకునే గొప్ప స్నేహితులను చెన్నై టీం అందించింది. రెండేళ్ల పాటు నాకు అండగా నిలిచిన సీఎస్ కే యాజమాన్యానికి, సిబ్బందికి, అభిమానులకు ధన్యవాదాలు'' అని భజ్జీ ట్వీట్ చేశాడు.

హర్భజన్ సింగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2018, 2019 సీజన్లలో చెన్నై తరపున ఆడాడు. 2020లో దుబాయ్ లో జరిగిన ఐపీఎల్ లో ఆడలేకపోయాడు భజ్జీ. టోర్నమెంట్ మొదలవ్వడానికి ముందు భజ్జీ 2020 ఎడిషన్ ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు భజ్జీ ఆడడానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు మొదటి నుండి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. 2018 వేలంలో హర్భజన్ ను సీఎస్ కే దక్కించుకుంది. రూ.2 కోట్లకు అతడితో ఒప్పందం చేసుకుంది. మొత్తంగా 160 మ్యాచ్ లు ఆడిన అతడు.. 150 వికెట్లు తీశాడు. 7.05 సగటుతో బౌలింగ్ చేశాడు. 137.22 స్ట్రైక్ రేట్ తో 829 పరుగులు చేశాడు.

భజ్జీ 2018లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. 2021 ఐపీఎల్ ఎడిషన్ కు సంబంధించి విడిచిపెట్టే ఆటగాళ్ల విషయంలో ఐపీఎల్ యాజమాన్యాలు కుస్తీ పడుతూ ఉన్నాయి. ప్లేయర్ రిటెన్షన్ అన్నది జనవరి 21న పూర్తీ అవ్వనుండగా.. ట్రేడింగ్ అన్నది ఫిబ్రవరి 4కు పూర్తీ అవ్వనుంది.




Next Story