క్రికెటర్ హనుమ విహారి సంచలన నిర్ణయం.. ఫిజియో హెచ్చరించినా వినకుండా..

Hanuma Vihari On Batting With Broken Wrist. ఆంధ్రప్రదేశ్-మధ్యప్రదేశ్ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్‌లో మణికట్టు గాయంతో కూడా బ్యాటింగ్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Feb 2023 10:33 AM GMT
క్రికెటర్ హనుమ విహారి సంచలన నిర్ణయం.. ఫిజియో హెచ్చరించినా వినకుండా..

ఆంధ్రప్రదేశ్-మధ్యప్రదేశ్ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్‌లో మణికట్టు గాయంతో కూడా బ్యాటింగ్ చేయడానికి వెటరన్ బ్యాటర్ హనుమ విహారి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడాన్ని క్రీడా ప్రపంచం ప్రశంసల్లో ముంచెత్తింది. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిన విహారీ జట్టును కాపాడుకోవడం కోసం లెఫ్ట్ హ్యాండర్ గా వచ్చాడు. గాయమైన మణికట్టును రక్షించుకోవడానికి ఎడమచేతితో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ నిర్ణయం విహారి కెరీర్‌కు ముప్పు కలిగిస్తుంది. జట్టు ఫిజియో కూడా విహారిని ఈ విషయమై హెచ్చరించాడు, అయితే విహారి గ్రౌండ్ లోకి వెళ్లి తన జట్టు కోసం కొన్ని కీలకమైన పరుగులు సాధించాలని నిశ్చయించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆంధ్రా తొలి ఇన్నింగ్స్‌లో పేసర్ అవేశ్ ఖాన్ వేసిన షార్ట్ డెలివరీని ఎదుర్కొంటూ విహారి ఎడమ మణికట్టు విరిగింది.

జట్టు కష్టాల్లో ఉండడంతో ఫ్రాక్చర్‌ను సైతం లెక్క చేయకుండా, నొప్పిని భరిస్తూ ఒంటిచేత్తో బ్యాటింగ్‌ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అతి కష్టమ్మీద 27 పరుగులు చేసిన విహారి తన జట్టుకు అవసరమైన పరుగులు జోడించి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. మూడోరోజే విహారి మళ్లీ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ఆంధ్రా జట్టు 76 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో మరోసారి బరిలోకి దిగిన విహారి ఎడమచేత్తో బ్యాటింగ్‌ చేశాడు. మొత్తం 16 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీల సాయంతో 15 పరుగులు చేశాడు.

విహారి మాట్లాడుతూ, "నేను బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మళ్లీ చేతికి తగిలితే నా కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఫిజియో నాకు 10 సార్లు చెప్పారు. ఈ మ్యాచ్ తర్వాత క్రికెట్ ఆడతాను కానీ ఈ మ్యాచ్‌లో ఆంధ్రా కోసం బ్యాటింగ్ చేయకుండా వదులుకుంటే అది ఎప్పటికీ నన్ను బాధపెడుతూనే ఉంటుంది. క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌, ఆంధ్రాకి చాలా ముఖ్యమైన మ్యాచ్‌ కావడంతో బ్యాటింగ్‌ చేయాలని అనుకున్నాను. చివరి వికెట్‌కు 10-15 పరుగులు జోడించగలిగినా ప్రయోజనం ఉంటుందని భావించాను. టీమ్‌ కోసం చేయాలని అనుకుంటే చాలా ధైర్యం వస్తుంది’’ అని అన్నారు.


Next Story