క్రికెట్‌పై రాజకీయాలు తగవు: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్
క్రికెటర్ హనుమ విహారి ఎపిసోడ్ ప్రస్తుతం సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 28 Feb 2024 11:59 AM IST
క్రికెట్‌పై రాజకీయాలు తగవు: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్
క్రికెటర్ హనుమ విహారి ఎపిసోడ్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇదే అంశంపై తాజాగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. ఈ మేరకు మూడు పేజీల లేఖను విడుదల చేసింది. ప్రతిష్టాత్మకంగా ఏసీఏ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపింది. క్రికెట్ అనేది ఒక జెంటిల్ గేమ్ అనీ.. దీని విస్తరణలో దేశంలోని అనేక అసోసియేషన్లు కీలక పాత్రలు పోషిస్తున్నాయని చెప్పింది. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళి, నిర్వహణలో నిర్దేశిత నిబంధనలు అనుసరిస్తూ అసోసియేషన్ ముందుకు సాగుతోందని తెలిపింది.
రాజకీయ ఒత్తిళ్ల వల్ల తనని కెప్టెన్సీకి రాజీనామా చేయాలని రాష్ట్ర అపెక్స్ క్రికెట్ బాడీ అనాలోచితంగా కోరడంతో తాను ఇకపై ఆంధ్రప్రదేశ్ తరపున ఆడబోనని ప్రకటించాడు. ఈ క్రమంలోనే స్పందించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్.. సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం తగదని పేర్కొంది. సోషల్ మీడియా వేదికగా అతను ఆరోపణలు చేయడంతో.. కొన్ని రాజకీయ పక్షాలు దీన్ని రాజకీయం చేస్తున్నాని తెలిపింది. అందుకే పూర్తి వివరణ ఇచ్చింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్.
జట్టులో మరో ఆటగాడైన కె.ఎన్. పృథ్విరాజ్ పైనా హనుమ విహారి ఆరోపణలు చేశాడని ఏసీఏ తెలిపింది. రాజకీయంగా ప్రభావితం చేసే వ్యక్తి అంటూ ఆరోపణల్లో పేర్కొన్నారని అన్నది ఏసీఏ. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రా రంజీ ట్రోఫీలో 17వ సభ్యుడుగా ఉన్న కె.ఎన్. పృథ్వి రాజ్ ఒకే సారి రంజీ జట్టులోకి రాలేదని అన్నది. బాల్యం నుంచి అండర్ 14, 16 ఏజ్ గ్రూప్, అండర్-19, వినూ మన్కండ్, కూచ్ బిహార్, అండర్ 23, మరియు 25 కల్నల్ సి. కె. నాయుడు ట్రోఫీలో ఆడి చక్కటి ప్రతిభను చూపారని వివరించింది. ఈ ఏడాది జనవరిలో బెంగాల్‌తో ఆడిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో జట్టుకు అప్పుడు కెప్టెన్ గా ఉన్న హనుమవిహారి పృథ్విరాజ్ ను కాదని గాయపడిన ఇంకొక వికెట్ కీపర్ను ఆడించారని ఏసీఏ తెలిపింది. బెంగాల్‌తో రంజీ మ్యాచ్ సందర్భంగా విహారి వ్యక్తిగతంగా ఆ ఆటగాడిని అందరి ముందు దూషించారంటూ మాకు ఫిర్యాదు కూడా వచ్చిందని పేర్కొంది.
అంతేకాకుండా హనుమ విహారి గతంలో ముస్తాక్ అలీ టోర్నీ సందర్భంగా అసభ్య పదజాలం వాడటం, తోటి ఆటగాళ్ల పట్ల అనుచింతంగా ప్రవర్తించడంపట్ల ఆంధ్రా జట్టు మేనేజర్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. హనుమ విహారి వ్యవహారశైలి కారణంగా జట్టులో వర్గ విభేదాలు చోటుచేసుకున్నాయని అందులో పేర్కొన్నారు.
హనుమ విహారి తీరుపై ఫిర్యాదులు రావడంతో జనవరి 2024లో, మొదటి రంజీ ట్రోఫీ మ్యాచ్ తర్వాత ఏసీఏ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్ చౌదరి కొత్త కెప్టెన్ ను ప్రతిపాదిస్తూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ఒక ఇ-మెయిల్ పంపారు. దీనికి విహారి స్పందిస్తూ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి వంద శాతం కట్టుబడి ఉంటానని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ప్రతిగా మెయిల్ కూడా పంపారు. ఈ వ్యవహారంలో క్రికెట్ అసోసియేషన్ ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. నిర్ణయాధికారాన్ని పూర్తిగా సెలక్షన్ కమిటీయే తీసుకుంది.
వాస్తవాలు ఇలా ఉంటే, ప్రతిష్ట్మాతక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై హనుమ విహారి సామాజిక మాధ్యమాల్లో చేసిన ఆరోపణలను వేదికగా చేసుకుని కొన్ని రాజకీయపార్టీలు, ఆ పార్టీలకు చెందిన నాయకులు విమర్శలు చేయడం అత్యంత విచారకరమని ఏసీఏ తెలిపింది. క్రికెట్ పై రాజకీయాలు తగవని వారికి ఏసీఏ సవినయంగా విజ్ఞప్తి చేస్తుదని మూడు పేజీల లేఖలు విడుదల చేసింది.