సఫారీలను 177 పరుగులతో చిత్తు చేసిన ఆఫ్ఘనిస్థాన్

ఆఫ్ఘనిస్థాన్ జట్టు వరుసగా రెండో వన్డే మ్యాచ్ లో కూడా సౌతాఫ్రికా జట్టును చిత్తు చేసింది. షార్జా స్టేడియం వేదికగా జరిగిన వన్డే మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టును ఏకంగా 177 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఓడించింది.

By Medi Samrat  Published on  21 Sept 2024 8:45 AM IST
సఫారీలను 177 పరుగులతో చిత్తు చేసిన ఆఫ్ఘనిస్థాన్

ఆఫ్ఘనిస్థాన్ జట్టు వరుసగా రెండో వన్డే మ్యాచ్ లో కూడా సౌతాఫ్రికా జట్టును చిత్తు చేసింది. షార్జా స్టేడియం వేదికగా జరిగిన వన్డే మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టును ఏకంగా 177 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేయగా.. ఛేజింగ్ లో సఫారీలు 134 పరుగులకు పరిమితమయ్యారు.

మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్ గర్భాజ్ సెంచరీతో కదంతొక్కాడు. 110 బంతుల్లో 105 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ రియాజ్ హసన్ 29 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన రహమత్ 50 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. అజ్మతుల్లా 86 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అజ్మతుల్లా హిట్టింగ్ తో ఆఫ్ఘనిస్థాన్ 300 పరుగుల మార్క్ ను దాటింది.

ఇక ఛేజింగ్ లో దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టారు. దక్షిణాఫ్రికా మొదటి వికెట్ 73 పరుగుల వద్ద పడగా.. 134కు ఆలౌట్ అయ్యారు. కెప్టెన్ బవుమా 38 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 7 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమవ్వడంతో దక్షిణాఫ్రికా ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ లో బౌలింగ్ తో రెచ్చిపోయాడు. 9 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 19 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మూడు మ్యాచ్ ల సిరీస్ లో ఆఫ్ఘనిస్థాన్ మొదటి రెండు మ్యాచ్ లు గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది.

Next Story