17 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత పాకిస్థాన్ గడ్డపై ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో పాక్‌పై ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇదే ఊపులో రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇంగ్లీష్ ఆటగాళ్లు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ మేరకు వ్యూహాలను రచిస్తున్నారు.
ముల్తాన్ వేదికగా నేటి(శుక్రవారం) నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఇంగ్లాండ్ క్రికెటర్లు బస చేస్తున్న హోటల్‌కు సమీపంలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దీంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముల్తాన్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉంటున్న హోటల్‌కు ఒక కిలోమీటర్ దూరంలో గురువారం కాల్పుల శబ్ధం వినిపించింది.
ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ముఠాల మధ్య గొడవల్లో తుపాకీ కాల్పులు వినిపించాయని, అయితే.. ఎవ్వరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు. ఈ ఘటన తరువాత ఇంగ్లాండ్ ఆటగాళ్లకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
2009లో శ్రీలంక క్రికెటర్లపై గడాఫీ స్టేడియం సమీపంలో దుండగులు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆరుగురు లంక క్రికెటర్లు గాయాలయ్యాయి. ఈ ఘటనతో పాక్‌లో పర్యటించేందుకు అన్ని దేశాలు విముఖత వ్యక్తం చేశాయి. ఆ దేశం అతిథ్యం ఇవ్వాల్సిన సిరీస్‌లను దుబాయ్ వేదికగా నిర్వహించారు. ఇప్పుడిప్పుడే పాకిస్థాన్‌లో పలు దేశాలు పర్యటిస్తున్నాయి.