హార్దిక్ పాండ్యా స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌పై క‌న్నేసిన గుజరాత్ టైటాన్స్.!

డిసెంబర్ 19న దుబాయ్‌లో ఐపీఎల్‌-2024 సీజ‌న్‌ ఆటగాళ్ల వేలంపాట జరగనుంది. అన్ని ఫ్రాంచైజీలు వేలానికి సిద్ధమయ్యాయి.

By Medi Samrat  Published on  12 Dec 2023 4:12 PM IST
హార్దిక్ పాండ్యా స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌పై క‌న్నేసిన గుజరాత్ టైటాన్స్.!

డిసెంబర్ 19న దుబాయ్‌లో ఐపీఎల్‌-2024 సీజ‌న్‌ ఆటగాళ్ల వేలంపాట జరగనుంది. అన్ని ఫ్రాంచైజీలు వేలానికి సిద్ధమయ్యాయి. ఈసారి వేలంలో మంచి ఆటగాళ్లను ద‌క్కించుకోవాల‌ని అన్ని ఫ్రాంచైజీలు ఎదురుచూస్తున్నాయి. వేలంలో అందరి దృష్టి గుజరాత్ టైటాన్స్ పైనే ఉంది. వేలానికి ముందు హార్దిక్ పాండ్యా గుజరాత్‌ను వదిలి ముంబై ఇండియన్స్‌లో చేరడ‌మే ఇందుకు కార‌ణం. వేలంలో హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంను దొరకబుచ్చుకోవాల‌ని గుజరాత్ భావిస్తోంది. పాండ్యా 4వ నంబర్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ కూడా బాగా చేస్తాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ అటువంటి ఆట‌గాడి కోసం ఎదురుచూస్తోంది.

హార్దిక్ పాండ్యా జట్టుకు దూరం కావ‌డంతో గుజరాత్ టైటాన్స్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. హార్దిక్ గొప్ప కెప్టెన్‌గానే కాకుండా గొప్ప ఆల్ రౌండర్ కూడా. ఇప్పుడు ఈ లోపాన్ని అధిగమించడానికి, గుజారాత్ వేలంలో అటువంటి బ్యాట్స్‌మెన్‌పై పందెం వేయాలనుకుంటోంది. దీనికి సంబంధించి ఇద్దరు ఆటగాళ్లపై గుజరాత్ టైటాన్స్ కన్ను వేయనుంది. వారే హ్యారీ బ్రూక్, డారిల్ మిచెల్.

ఐపీఎల్ 2024 వేలానికి ముందు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసింది. మరోవైపు 2023 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు చెందిన డారిల్ మిచెల్ అద్భుత ప్రదర్శన చేశాడు. అప్పటి నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీల చూపు మిచెల్‌పై పడింది. దీంతో గుజరాత్ టైటాన్స్ నంబర్-4 బలహీనతను అధిగమించడానికి ఈ ఆటగాళ్లను ద‌క్కించుకునే ప్ర‌య‌త్నం చేయ‌నుంద‌ని నివేదిక‌లు చెబుతున్నాయి.

గుజరాత్‌ నుంచి హార్దిక్‌ పాండ్యా తప్పుకున్న తర్వాత గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్సీ శుభ్‌మన్‌ గిల్‌ చేతుల్లోకి వెళ్లింది. గిల్ తొలిసారిగా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కనిపించనున్నాడు. కెప్టెన్సీలో గిల్ ఎలాంటి ప్రభావం చూపిస్తాడో చూడాలి. గుజరాత్ తరఫున గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే అతను ఎలాంటి కెప్టెన్ అవుతాడో చూడాలి మ‌రి.

Next Story