Gujarat Titans : సొంతగడ్డపై హార్థిక్ సేన సింహనాదం
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది
By తోట వంశీ కుమార్ Published on 1 April 2023 3:00 AM GMTసొంతగడ్డపై హార్థిక్ సేన సింహనాదం
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)16వ సీజన్ తొలి మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని ఇచ్చింది. లక్ష మందికి పైగా ప్రేక్షకులతో కిక్కిరిసిన మైదానంలో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్‌ను గెలుపుతో ప్రారంభించింది. సొంతగడ్డపై సింహనాదం చేసింది హార్థిక్ సేన. తొలుత రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్ల వర్షం కురిపించగా.. చేధనలో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ చక్కటి క్రికెటింగ్ షాట్లతో అలరించాడు.
179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (25 ; 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (63; 36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు 37 పరుగులు జోడించారు. సాహా ఔటైన గిల్ తనదైన శైలిలో చక్కని క్రికెటింగ్ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. విలియమ్సన్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సాయి సుదర్శన్ (22) కూడా చెలరేగడంతో 11 ఓవర్లలోనే గుజరాత్ 100 పరుగులు దాటింది. ఈ క్రమంలో గిల్ 30 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు.
స్వల్ప వ్యవధిలో సుదర్శన్, హార్థిక్(8) ఔటైనా గిల్ జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. 15వ ఓవర్ చివరి బంతికి గిల్ పెవిలియన్‌కు చేరినా విజయ్ శంకర్ (27; 21 బంతుల్లో2 ఫోర్లు, ఒక సిక్సర్), రషీద్ ఖాన్(10 నాటౌట్), తెవాటియా(15 నాటౌట్)లు సమయోచితంగా ఆడడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ విజయం సాధించింది.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (92; 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లు) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. రుతురాజ్ విధ్వంసాన్ని చూస్తే చెన్నై అలవోకగా 200 పరుగులు చేస్తుందని అనిపించింది. అయితే.. రుతురాజ్ మినహా మిగిలిన ఆటగాళ్లు విఫలం కావడంతో 178 పరుగులకే పరిమితమైంది. బెన్ స్టోక్స్ (7)తో పాటు డ్వేన్ కాన్వే (1), రవీంద్ర జడేజా (1) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. రషీద్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.