భ‌వీనాకు భారీ న‌జ‌రానా.. స్వ‌స్థ‌లంలో సంబురాలు..

Gujarat government to give Rs 3 crore to Bhavina Patel.టోక్యోలో జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో అద్భుత క‌న‌బ‌ర్చి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Aug 2021 8:39 AM GMT
భ‌వీనాకు భారీ న‌జ‌రానా.. స్వ‌స్థ‌లంలో సంబురాలు..

టోక్యోలో జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో అద్భుత క‌న‌బ‌ర్చి టేబుల్ టెన్నిస్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించింది భవీనాబెన్ పటేల్. ప్ర‌స్తుతం ఆమెపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఆమె జీవితం ఎంద‌రికో స్పూర్తిదాయ‌కం అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభినంద‌లు తెలుప‌గా.. భవీనాబెన్‌ సాధించిన విజయం దేశానికి గర్వకారణం అని.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఇదిలా ఉంటే.. గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీ ఆమెకు భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని దివ్యాంగ్ ఖేల్ ప్ర‌తిభా ప్రోత్సాహ‌న్ పుర‌స్కార్ యోజ‌న కింద రూ.3 కోట్లు భ‌వీనా ప‌టేల్‌కు న‌జ‌రానాగా అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు.

కాగా.. ర‌జ‌తం సాధించిన త‌రువాత భ‌వీనా మీడియాతో మాట్లాడారు. ఈ రోజు కాస్త నెర్వ‌స్‌గా ఫీల‌య్యాను. అందుక‌నే 100శాతం ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌లేక‌పోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌రువాతి టోర్నీల్లో ఈ త‌ప్పును స‌రిదిద్దుకుంటాన‌ని వెల్ల‌డించారు. ఓ త‌లుపు మూసుకుంటే.. మ‌రో త‌లుపు తెరుకుంటుంద‌ని తాను న‌మ్ముతాన‌ని అన్నారు. స‌మ‌స్య‌ల‌ను సానుకూలంగా చూడ‌టం వ‌ల్లే క‌ఠోరంగా శ్ర‌మించే ధైర్యాన్ని త‌న‌కు ఇస్తుంద‌న్నారు.

భ‌వానీ స్వ‌స్థ‌ల‌మైన‌ మెహ‌సానా ప‌ట్ట‌ణంలో సంబురాలు అంబ‌రాన్నంటాయి. కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులు, ఇరుగుపొరుగు అంతా క‌లిసి భ‌వీనా విజ‌యం సాధించిన ఘ‌డియ‌లు పండుగ‌లా జ‌రుపుకున్నారు. ఒక‌రికొక‌రు స్వీట్లు పంచుకున్నారు. ప‌టాకులు కాల్చారు. అనంత‌రం గుజ‌రాతీ సంప్ర‌దాయ నృత్య‌మైన గార్బా డ్యాన్స్‌తో అల‌రించారు. భ‌వీనా త‌ల్లిదండ్రుల‌తోపాటు, స్నేహితులు, ఊరివాళ్లు అంతా క‌లిసి నృత్యం చేశారు.

గుజ‌రాత్ రాష్ట్రంలోని వాడ్‌న‌గ‌ర్ భ‌వీనా స్వ‌స్థ‌లం. ఆమె 12 నెల‌ల వ‌య‌సులోనే పోలియో బారిన పడింది. దీంతో చ‌క్రాల కుర్చీకే ప‌రిమితం అయ్యింది. గ్రాడ్యుయేష‌న్ చ‌దివే స‌మ‌యంలో టేబుల్ టెన్నిస్ ఆడ‌టం మొద‌లుపెట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు ప‌లు అంత‌ర్జాతీయ టోర్నీల్లో ఆడిన భ‌వీనా.. ఐదు గోల్డ్ మెడ‌ల్స్‌, 13 సిల్వ‌ర్ మెడ‌ల్స్ సాధించింది. తాను తొలిసారి ఆడిన పారాలింపిక్స్‌లో చిరస్మ‌ర‌ణీయ ప్ర‌దర్శ‌న ర‌జిత ప‌త‌కం సాధించింది.

Next Story