పాపం హార్దిక్.. స్టేడియంలో శునకం ఎంట్రీతో గుజరాత్ ఫ్యాన్స్‌ అరుపులు

ఐపీఎల్‌2024 సీజన్‌లో ఆదివారం మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడింది.

By Srikanth Gundamalla  Published on  25 March 2024 7:50 AM GMT
hardik pandya, troll, gujarat fans, viral video,

పాపం హార్దిక్.. స్టేడియంలో శునకం ఎంట్రీతో గుజరాత్ ఫ్యాన్స్‌ అరుపులు 

ఐపీఎల్‌2024 సీజన్‌లో ఆదివారం మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లు ముంబై టీమ్‌ ఓటమిని చూసింది. గుజరాత్‌ తమ హోం గ్రౌండ్‌లో ఆడి తొలి మ్యాచ్‌లో గెలిచి.. విజయంతో ఈ సీజన్‌ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఇక ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా.. గుజరాత్‌, ముంబై మ్యాచ్‌ సందర్భంగా స్టేడియంలో పలు ఆసక్తికర సంఘటనలు జరిగాయి. ముంబై కెప్టెన్‌గా హార్దిక్‌ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆయనపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.

గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ను తిరిగి ముంబై తమ టీమ్‌లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్‌ శర్మను కాదని హార్దిక్‌కు ఇచ్చింది. దాంతో.. రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై ఫ్రాంచైజీతో పాటు.. హార్దిక్‌పైనా విమర్శలు చేశారు. మ్యాచ్‌ సందర్భంగా కూడా హార్దిక్‌ .. రోహిత్‌ను బౌండరీ లైన్‌ వద్దకు తరలించాడు. ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది. రోహిత్‌ శర్మ గతంలో ఎప్పుడూ బౌండరీ లైన్ వద్ద ఫీల్డ్‌ చేయలేదు.. కానీ దాన్ని మార్చేసిన హార్దిక్‌ రోహిత్‌ను గ్రౌండ్‌లో అటుఇటు పరిగెత్తించాడు. ఇలా వరుసగా హార్దిక్‌ పై విమర్శలు.. కౌంటర్లు పడుతూనే ఉన్నాయి.

గుజరాత్‌ ఫ్యాన్స్‌ కూడా హార్దిక్‌ పాండ్యాపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌లో తొలి మ్యాచ్‌ జరగ్గా.. ఈ సందర్భంగా ఫీల్డింగ్‌లో ఉన్న హార్దిక్‌పై గుజరాత్‌ ఫ్యాన్స్‌ బాటిల్స్‌ విసిరారు. తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీమ్‌ను మధ్యలో వదిలేసి వెళ్తావా అన్నట్లుగా సోషల్‌ మీడియాలో గుజరాత్‌ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. అంతేకాదు.. మ్యాచ్‌ సందర్భంగా మ్యాచ్‌ జరుగుతుండగానే ఓ శునకం అనుకోకుండా గ్రౌండ్‌లోకి వచ్చింది. అదికూడా హార్దిక్‌పై విమర్శలకు అస్త్రం అయ్యింది. గ్రౌండ్‌లోకి శునకం రాగానే.. గుజరాత్‌ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా.. హార్దిక్‌ హార్దిక్‌ హార్దిక్‌ అని అరుపులు మొదలు పెట్టారు. శునకాన్ని వీడియో తీస్తూ హార్దిక్‌ను ఉద్దేశించే అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. శునకంతో ఎందుకు పోలుస్తున్నారు.. అది విశ్వాసంగా ఉంటుందంటూ నెటిజన్లు కూడా చురకలంటిస్తున్నారు. అటు రోహిత్‌ ఫ్యాన్స్.. గుజరాత్‌ టైటాన్స్‌ అభిమానుల విమర్శలు..వెక్కిరింతలతో మ్యాచ్‌ సందర్భంగా హార్దిక్ కాస్త కలత చెందినట్లు అనిపించింది.


Next Story