ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వారు కోలుకున్నారు

Good news to Dhoni's fans, Dhoni Parents recovered.ధోని తల్లిదండ్రులు కరోనా నుండి కోలుకున్నారనే వార్త వారికి ఇంకొంత ఆనందాన్ని ఇస్తోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 April 2021 10:35 AM GMT
Dhoni Parents recovered

మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుని వెళ్తూ ఉండడం అతడి ఫ్యాన్స్ కు ఆనందాన్ని అందిస్తూ ఉండగా.. మరో వైపు ధోని తల్లిదండ్రులు కరోనా నుండి కోలుకున్నారనే వార్త వారికి ఇంకొంత ఆనందాన్ని ఇస్తోంది. మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ధోనీ త‌ల్లిదండ్రులు దేవ‌కీ దేవి, పాన్‌సింగ్‌ ఈ నెల 20 నుంచి రాంచీలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఆరోగ్యం స్థిరంగా ఉండడంతో వైద్యులు తాజాగా పరీక్షలు నిర్వహించారు. కరోనా నెగటివ్‌ అని నిర్ధారణ కావడంతోపాటు, లక్షణాలేవీ లేకపోవడంతో బుధవారం వీరిని డిశ్చార్జ్ చేశారు. తన తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌ అని తెలిసినప్పుడు ధోనీ ముంబైలో ఉన్నాడు.

బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (46 బంతుల్లో 61; 5 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్‌ వార్నర్‌ (55 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. కేన్‌ విలియమ్సన్‌ (10 బంతుల్లో 26 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో ధాటిగా ఆడాడు. పాండే, వార్నర్‌ రెండో వికెట్‌కు 87 బంతుల్లో 106 పరుగులు జోడించారు. చెన్నై 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 173 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (44 బంతుల్లో 75; 12 ఫోర్లు), డుప్లెసిస్‌ (38 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్‌)ల ధాటికి మొదటి 10 ఓవర్లలోనే మ్యాచ్ చెన్నై చేతిలోకి వెళ్ళింది. మరో 9 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఈ గెలుపుతో ధోనీ సేన 10 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 75 పరుగులు చేసిన గైక్వాడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


Next Story