రోహిత్ శర్మ అభిమానులకు బీసీసీఐ గుడ్‌న్యూస్!
ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంతో రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర అసంతృప్తిలో ఉన్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 18 Dec 2023 11:52 AM ISTరోహిత్ శర్మ అభిమానులకు బీసీసీఐ గుడ్‌న్యూస్!
ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంతో రోహిత్ శర్మ అభిమానులు తీవ్ర అసంతృప్తిలో ఉన్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగిస్తూ.. ఆ బాధ్యతలను తిరిగి టీమ్‌లోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకు అప్పగించింది. ఆ ఫ్రాంచైజీపై రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ రోహిత్ శర్మ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాలని భావిస్తోంది. 2024 జూన్‌లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా సారథిగా తమ ఫస్ట్ చాయిస్ రోహిత్ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
2022 టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌లో భారత్ ఓటమిపాలైంది. ఆ తర్వాత మళ్లీ రోహిత్ శర్మ టీ20ల్లో ఆడలేదు. అప్పటి నుంచి హార్దిక్ పాండ్యానే టీ20ల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. హార్దిక్‌ను టీ20ల్లో కెప్టెన్ అని బీసీసీఐ అధికారికంగా ప్రకటించకపోయినా.. దాదాపు అన్ని మ్యాచుల్లో అతడే సారథ్యం వహించాడు. మరోవైపు వన్డే వరల్డ్‌కప్-2023 ఓటమి తర్వాత టీ20, వన్డేలు ఆడేందుకు కూడా రోహిత్ సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో.. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో హార్దిక్‌నే కెప్టెన్‌గా ఉంచుతారని అంతా భావించారు.
మరోవైపు ముంబై ఇండియన్స్ కూడా రోహిత్‌ను కెప్టెన్‌గా తొలగించింది. దాంతో.. టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్ కెప్టెన్‌గా ఉండడేమో అనుకున్నారు. కానీ.. బీసీసీఐ మాత్రం విభిన్నంగా స్పందించింది. ఒక ఫ్రాంచైజీ నిర్ణయం బీసీసీఐపై ప్రభావం చూపదని వెల్లడించింది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం ఆ ఫ్రాంచైజీ నిర్ణయం మాత్రమే అన్నారు. టీమిండియాపై ఎలాంటి ప్రభావం చూపదని వెల్లడించారు బీసీసీఐ అధికారి ఒకరు. అయితే.. అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా రోహిత్ శర్మనే కొనసాగుతారని చెప్పారు. టీ20 వరల్డ్‌కప్‌కు మరో ఆరు నెలల సమయం ఉన్నందున అధికారిక ప్రకటన మాత్రమే రాలేదని చెప్పారు. టీమిండియాకు రోహిత్ శర్మ సహజమైన కెప్టెన్ అని.. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించలేమని బీసీసీఐ అధికారి తెలిపారు.