శుభ్‌మన్ గిల్ మరో సెంచరీ.. ముంబైని చిత్తు చేసి ఫైనల్ చేరిన గుజరాత్
Gill century, Mohit 5-fer lead Titans to 2nd consecutive final. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది.
By Medi Samrat Published on 27 May 2023 1:33 AMఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం ప్రభావిత మ్యాచ్‌లో రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. అనంతరం ముంబై జట్టు 18.2 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది.
ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి.. వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరింది. దీంతో ఫైనల్ మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఇక చెన్నై 10వ సారి ఫైనల్ ఆడనుంది. అదే సమయంలో.. గుజరాత్ టైటాన్స్ జట్టు గతేడాది రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. గుజరాత్ జట్టు కూడా ఫైనల్లో చెన్నైపై ప్రతీకారం తీర్చుకోనుంది. క్వాలిఫయర్-1లో గుజరాత్ జట్టుపై మహేంద్ర సింగ్ ధోనీ సేన విజయం సాధించింది.
గుజరాత్ నిర్దేశించిన 234 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ముంబై జట్టు 18.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కామెరాన్ గ్రీన్ మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. సూర్యకుమార్ 38 బంతుల్లో అత్యధికంగా 61 పరుగులు చేశాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. తిలక్ వర్మ 14 బంతుల్లో 43 పరుగులు చేశాడు. కామెరాన్ గ్రీన్ 20 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఎనిమిది మంది ముంబై ఆటగాళ్లు రెండంకెల స్కోరును దాటలేకపోయారు.
ఇషాన్ కిషన్ గాయం కారణంగా.. రోహిత్ శర్మతో కలిసి నెహాల్ వధెరా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. వధెరా నాలుగు, రోహిత్ శర్మ ఎనిమిది పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుటయ్యారు. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన విష్ణు వినోద్, టిమ్ డేవిడ్ విఫలమయ్యారు. కుమార్ కార్తికేయ సిక్స్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా ఎవరూ క్రీజులో నిలవలేదు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ ఐదు వికెట్లు తీసి ముంబై జట్టును కుప్పకూల్చగా.. మహ్మద్ షమీ రెండు, రషీద్‌ఖాన్ రెండు, జాషువా లిటిల్ ఒక వికెట్ చొప్పున తీశారు.
గుజరాత్ తరఫున శుభ్‌మన్ గిల్ మరో సెంచరీ(129) తో ఆకట్టుకున్నాడు. 60 బంతుల్లో ఏడు ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు. నాలుగు మ్యాచ్‌ల్లో గిల్‌కి ఇది మూడో సెంచరీ. గిల్‌కు తోడుగా సాయి సుదర్శన్ 31 బంతుల్లో 43 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. వృద్ధిమాన్ సాహా 16 బంతుల్లో 18 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్ రెండు బంతుల్లో ఐదు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆకాశ్ మధ్వల్, పీయూష్ చావ్లా ఒక్కో వికెట్ తీశారు.