టీమిండియా లోయర్ ఆర్డర్‌పై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా మాజీ క్రికెటర్‌ భారత జట్టు లోయర్‌ ఆర్డర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

By Srikanth Gundamalla  Published on  19 Sep 2023 8:18 AM GMT
Gautam Gambhir, Team India, AUS Vs IND,

టీమిండియా లోయర్ ఆర్డర్‌పై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు

వన్డే ప్రపంచ కప్‌ దగ్గర పడుతోంది. ఈ క్రమంలో టీమిండియా మరో సిరీస్‌ ఆడేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఆసియా కప్‌లో రాణించిన టీమిండియా కప్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్‌లో అయి బౌలర్లు సత్తా చూపించారు. సిరాజ్‌ ఒక్కడే ఏకంగా 6 వికెట్లు తీసి శ్రీలంకకు చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంక టాప్‌ ఆర్డర్‌ నడ్డీ విరిచాడు. అయితే.. టీమిండియా తాజాగా ఆస్ట్రేలియా జట్టుతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ భారత జట్టు లోయర్‌ ఆర్డర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

త్వరలోనే వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీ ప్రారంభం కానుందని.. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకొచ్చాడు గౌతమ్ గంభీర్. ఆలోపు భారత జట్టు ఒక విభాగంలో సెట్‌ కావాలని.. లోయర్ ఆర్డర్‌ మరింత నాణ్యమైన క్రికెట్‌ ఆడాల్సిన అవసరం ఉందని చెప్పాడు. రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాలని.. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించాలని గౌతమ్ గంభీర్ సూచించాడు.

రవీంద్ర జడేజా ఎలాంటి పిచ్‌పైన అయినా పది ఓవర్ల కోటా వేయగలడు అని గంభీర్ అన్నాడు. అదే విధంగా అతడు అద్భుతమైన ఫీల్డర్‌ అని.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. కేవలం ఆరుగురు బ్యాటర్లతోనే వరల్డ్‌ కప్‌లో ఆడటం సులువు కాదని సూచించాడు. ఇషాన్ కిషన్‌ను ఐదో స్థానంలో ఆడిస్తే కొన్ని ప్రశ్నలు తలెత్తడం సహజమని గంభీర్ పేర్కొన్నాడు. లోయర్‌ ఆర్డర్‌లో హార్డిక్ పాండ్యా, రవీంద్ర జడేజా విలువైన పరుగులు చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌లను గెలిపించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంటుందని గౌతమ్ గంభీర్ తెలిపాడు. చివరి 10 ఓవర్లలో 80 నుంచి 90 పరుగులు చేయాల్సి వస్తే ఆరేడు స్థానాల్లో వచ్చే బ్యాటర్లు జట్టును గెలిపించాలని గౌతమ్ గంభీర్ అన్నాడు.

ఆసియా కప్‌లో రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రాణించాడు. కానీ.. బ్యాటింగ్‌లో తన మ్యాజిక్‌ను కొనసాగించలేకపోయాడు. సెప్టెంబర్‌ 22 నుంచి ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌లో అయినా జడేజా తన బ్యాట్‌కి పని చెప్పి ఫామ్‌లోకి వస్తే తిరుగుఉండదని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

Next Story