టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరు రంజీ క్రికెట్ ఆడాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించాడు. రంజీ క్రికెట్ ద్వారా వారు మునపటి ఫామ్‌ను అందుకోగలరన్నాడు.
పుజారా, రహానేలు ఇద్దరూ నాణ్యమైన ఆటగాళ్లు. టీమ్ఇండియాకు ఎన్నో విజయాలను అందించారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. రంజీ ట్రోఫీ వారిద్దరికి మంచి అవకాశం. పరుగులు రాబట్టేందుకు ఈ సీజన్ వారికి చక్కగా ఉపయోగపడుతుంది. గతంలో చాలా మంది క్రికెటర్లు ఫామ్ కోల్పోయినప్పుడు రంజీ క్రికెట్ ఆడి మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేశారు. ఇక 2005లో నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నా. అప్పుడు నేను కూడా రంజీ క్రికెట్ ఆడి మునపటి ఫామ్ అందుకోగలిగా. అందుకే వీళ్లిద్దరూ ఆడి ఫామ్‌ను అందుకుంటారని ఆశిస్తున్నట్లు సౌరవ్ గంగూలీ చెప్పాడు.
రెండు సంవత్సరాల తర్వాత రంజీ ట్రోఫీ సీజన్ ఆరంభం కానుంది. కరోనా మహమ్మారి కారణంగా గతంలో రంజీ ట్రోఫిని నిర్వహించలేకపోయారు. అయితే.. ఈసారి రంజీ సీజన్ ను రెండు దశల్లో జరగనుంది. ఈ నెల చివరి వారంలో రంజీ సీజన్ తొలి దశ ప్రారంభం కానుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత నాకౌట్ దశను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.