భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మరో గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మెన్స్ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా గంగూలీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇన్నాళ్లు ఆ పదవిలో కొనసాగిన టీమ్ఇండియా దిగ్గజం అనిల్ కుంబ్లే పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో గంగూలీని నియమిస్తున్నట్లు ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్ల్కే ప్రకటించారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో గంగూలీ ఒకడని.. అలాంటి ఆటగాడి సేవలను ఉపయోగించుకోవాలని అనుకున్నామని, అలాగే బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా కలిసొస్తుందని గ్రెగ్ బార్ల్కే చెప్పారు.
భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 2012 నుంచి క్రికెట్ కమిటీ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు మూడు సార్లు పదవి కాలం పూర్తి కావడంతో.. ఐసీసీ నిబంధనల మేరకు ఆ పదవి నుంచి తప్పుకోనున్నాడు. కుంబ్లే చేసిన సేవలను గ్రెగ్ బార్ల్కే కొనియాడాడు. కుంబ్లే చేసిన సేవలు మరువలేనివని చెప్పుకొచ్చారు. డీఆర్ఎస్ సరిగ్గా అమలయ్యేలా చూడడం, అనుమానాస్పద బౌలింగ్ శైలిలపై సరైన నిర్ణయాలు తీసుకోవడం వంటి విషయాలపై కుంబ్లే కీలకంగా వ్యవహరించాడని తెలిపారు.
భారత జట్టు రూపు రేఖలను మార్చిన కెప్టెన్ గా పేరున్న దాదా.. 2019 వరకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడిగా ఉన్నారు. అనంతరం 2019 అక్టోబర్‌లో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.