ఐపీఎల్ పై నో డౌట్స్ అంటున్న గంగూలీ
Ganguly gives clarity on IPL 2021. గుంగూలీ ఐపీఎల్ పై నో డౌట్స్ అంటు స్పష్టత ఇచ్చారు
By తోట వంశీ కుమార్ Published on 5 April 2021 9:02 AM GMTఐపీఎల్ సీజన్-14 ఏప్రిల్ 9 నుండి మొదలు కాబోతోంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడమే కాకుండా పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడుతూ ఉన్నారు. దానికి తోడు మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ విధించడంతో పాటు కఠిన ఆంక్షల్ని ప్రకటించడంతో ఐపీఎల్ రద్దవుతుందేమోనని భయాలు వెంటాడుతూ ఉన్నాయి. ఐపీఎల్ వాయిదా పడుతుందా అనే ప్రచారం కూడా సాగుతూ ఉండడంతో అలాంటి అవకాశమే లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశారు. ఐపీఎల్ 14వ సీజన్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని గంగూలీ అన్నారు. ఐపీఎల్ నిర్వహణ యథాతథంగా జరుగుతుందని గంగూలీ తేల్చి చెప్పారు.
పలువురు ఆటగాళ్లు, మైదానం సిబ్బంది కరోనా బారినపడడం భారత క్రికెట్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి కూడా కోవిడ్ సోకింది. దీంతో పాటు మరో ఆరుగురు ఈవెంట్ మేనేజర్లు కూడా కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఆందోళన మొదలైంది. ముంబైలో జరగాల్సిన మ్యాచ్‌లను హైదరాబాద్ లేదంటే ఇండోర్‌లో నిర్వహించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. కానీ బీసీసీఐ మాత్రం బయో బబుల్ ఏర్పాట్లు ఉన్నపళంగా మార్చలేమని, ఏదేమైనా కట్టుదిట్టమైన చర్యలతో ముంబైలోనే మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 10-25 మధ్య ముంబయిలో 10 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. తొలి మ్యాచ్ ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సి ఉంది.